Buddha Venkanna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కెలుకుతున్న టిడిపి

జూనియర్ ఎన్టీఆర్ పేరును కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు వాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పరిస్థితులకు తగ్గట్టు తాము జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులమని చెప్పుకుంటూ వస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 25, 2024 10:29 am

Buddha Venkanna

Follow us on

Buddha Venkanna: ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. టిడిపి గట్టిగానే పోరాడింది. అనుకూల ఫలితాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో కొందరు చేస్తున్న అతి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. నందమూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గట్టి హెచ్చరికలే పంపారు. ఇటీవలే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చైతన్య కృష్ణ వ్యవహార శైలి పెద్దగా బాగుండదు. సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్ అయ్యారు. మా మామ చంద్రబాబు జోలికి, బాబాయ్ బాలకృష్ణ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఆయన ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడంఏమంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఆయనపై ఒక రకమైన అపవాదు ఉంది. అయితే అంతకు ముందు రోజే జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.

వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టారు. బాలీవుడ్ కు కూడా తన కెరీర్ను విస్తరించాలని ప్లాన్ తో ఉన్నారు. అందులో సక్సెస్ అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం ఖాయం. అందుకే అనవసర విషయాల జోలికి ఆయన పొదలుచుకోవడం లేదు. ముఖ్యంగా రాజకీయాంశాల జోలికి వెళ్లడం లేదు. భవిష్యత్తులో చూసుకుందాంలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎంత పెద్ద రాజకీయ అంశమైనా ఆయన స్పందించడం లేదు. అటు టిడిపి నాయకత్వం కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చూసి చూడనట్టుగా ముందుకు సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఆయన జోలికి వెళ్లడం సహేతుకం కాదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరును కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు వాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పరిస్థితులకు తగ్గట్టు తాము జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో ఆయన ఫ్లెక్సీని, ఫోటోలను వాడుకున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది తెలియడం లేదు. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు చూస్తుంటే.. ఆయన కలుగజేసుకోరని అర్థమవుతుంది.అయితే వైసిపి జూనియర్ ఎన్టీఆర్ను వాడుకోవాలని చూసింది. కొంతవరకు ప్రయత్నించింది కూడా. టిడిపిలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను విభజించి లాక్కోవాలన్నది వైసీపీ ప్లాన్. ఇటువంటి సమయంలో టిడిపి జాగ్రత్తగా వ్యవహరించాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల విషయంలో లేనిపోని గందరగోళం సృష్టిస్తే అంతిమంగా అది టిడిపికే నష్టం.

తాజాగా విజయవాడకు చెందిన బుద్ధ వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సును కెలికారు. నారా లోకేష్ కు టిడిపి పగ్గాలు అప్పగించాలని కోరారు. అంతటితో ఆగకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ కు హాజరయ్యారు. అసలు తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీంతో టిడిపి శ్రేణులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య రచ్చ ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.మున్ముందు ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియని పరిస్థితి. లేనిపోని వివాదాలకు తావిచ్చి టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేందుకు.. కొంతమంది పని గట్టుకొని చేస్తున్న పని ఇది అని తెలుస్తోంది. దీనిపై టిడిపి నాయకత్వం స్పందించకుంటే మాత్రం.. ఈ వివాదం ముదిరే ఛాన్స్ కనిపిస్తోంది.