Serial Actress: సీనియర్ నటి కవిత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కవిత. 11 ఏళ్ల వయసులో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. దిగ్గజ దర్శకుడు కే . విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన సిరిసిరిమువ్వ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి అనేక సినిమాల్లో నటించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన కవిత తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఆమె జీవితంలో జరిగిన విషాదాన్ని తలచుకుని ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ .. నా భర్త దశరధరాజ్ ఎదురుకట్నం ఇచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను హీరోయిన్ గా 60 రోజులు కష్టపడి సంపాదించిన డబ్బును ఆయన ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తాడు. అలా అని నా డబ్బు అస్సలు ముట్టుకోరు.
పెళ్ళికి ముందు నా భర్తకి నేను ఓ కండిషన్ పెట్టాను. నేను పిల్లల్ని కనను అని ముందే చెప్పాను. నేనేదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు. పెళ్లయ్యాక మా అత్తగారు త్వరగా పిల్లలను కనాలని ఇబ్బంది పెట్టేది. నాకు పిల్లలు వద్దమ్మా అని అమ్మతో చెప్పాను. ఎందుకని అడగ్గా .. పుడితేనే కదా చనిపోతారు అని అన్నాను. తమ్ముడు చనిపోయాక వాడి జ్ఞాపకాలతోనే బతికాను. అతడిని మర్చిపోలేక అలా మాట్లాడాను.
అందరూ ఆ బాధ నుంచి బయటకు వచ్చేయమని చెప్పేవారు. కొన్ని నెలలకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. రోజూ తమ్ముడి ఫోటో చూసి ఏడ్చేదాన్ని. అది గమనించిన నా భర్త నాకు మనసు రిలాక్స్ అవుతుంది అని నన్ను వరల్డ్ టూర్ కి తీసుకెళ్లారు. పాప పుట్టాకే నా జీవితం సంతోషమయం అయింది. మొత్తం నాకు ముగ్గురు పిల్లలు. కరోనా వల్ల నా భర్త, కొడుకు చనిపోయారని చెప్తూ కవిత ఎమోషనల్ అయ్యారు. 2021లో కవిత కొడుకు కోవిడ్ తో మరణించాడు. మరో రెండు వారాలకు ఆమె భర్త కూడా కన్నుమూశాడు.