Botsa Satyanarayana: ఆ జిల్లాలో వైసీపీ స్వీప్ చేస్తుందట.. జోష్యం ఎవరిదో తెలుసా?

మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు బయటకు వచ్చినట్టు తెలిసిందే.

Written By: Dharma, Updated On : May 25, 2024 10:23 am

Botsa Satyanarayana

Follow us on

Botsa Satyanarayana: ఇంకా 10 రోజులు వ్యవధి మాత్రమే ఉంది. ఏపీ కొత్త పాలకులు ఎవరో తీర్పు రానుంది. అన్ని పార్టీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. లెక్కలు కట్టి తామే గెలుపొందుతామని ప్రకటిస్తున్నాయి. పెరిగిన ఓటింగ్ శాతం తమదేనని చెప్పుకొస్తున్నాయి. నేతల ప్రకటనలు కోటలు దాటుతున్నాయి. ప్రజల్లో కన్ఫ్యూజన్ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. మరోవైపు పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత విధ్వంసాలకు మీరే కారణం అంటే మీరే కారణం అని.. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లకు దిగుతున్నాయి.

మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు బయటకు వచ్చినట్టు తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ భిన్నంగా స్పందిస్తోంది. మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే.. ఒక్క పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడం ఏమిటని ప్రశ్నిస్తోంది.మరోవైపు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు.. రీ పోలింగుకు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి రిగ్గింగ్ కు పాల్పడిందని.. అటువంటి కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి లాంటివారు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఒకవైపు రీపోలింగ్ అడుగుతూనే.. మరోవైపు వైసీపీ నేతలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. సహజంగా ప్రభుత్వం, పార్టీ విధానాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ ఈసారి సీనియర్ మంత్రి బొత్స అన్ని బాధ్యతలు తీసుకుంటున్నట్లు కనిపించారు. గెలుపు పై ధీమా వ్యక్తం చేసిన బొత్స.. జూన్ 9న విశాఖలో జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం పై సైతం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. తన సొంత జిల్లా విజయనగరంలో 9 స్థానాలకు గాను.. తొమ్మిది స్థానాలను స్వీప్ చేస్తామని.. అన్నిచోట్ల విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని.. విజయనగరం ఏపీలో మరోసారి ప్రత్యేకంగా నిలవనుందని తేల్చి చెప్పారు.