BJP TDP Alliance: ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా బిజెపికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ సీట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు పార్లమెంట్ అభ్యర్థులను బిజెపి హై కమాండ్ ప్రకటించింది. అనకాపల్లి అరకు,రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట లకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. జాబితాను ప్రకటించింది.
ఎచ్చర్లకు నడికుదిటి ఈశ్వరరావు, విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ రాజారావు, అనపర్తి శివకృష్ణంరాజు, కైకలూరు కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు బొజ్జ రోశన్న, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆదోని పార్థసారథి, ధర్మవరం సత్య కుమార్ లు ఉన్నారు. ఇందులో గత టిడిపి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ లకు టిక్కెట్లు దక్కడం విశేషం. టిడిపిలో రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి అనుభవించిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీటును కేటాయించారు. ఇక్కడ టిడిపి టికెట్ కోసం బుద్ధ వెంకన్న తో పాటు జలీల్ ఖాన్ ప్రయత్నించారు. జనసేనలో అయితే పోతిన మహేష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ బిజెపిలోని చంద్రబాబు విధేయత కలిగిన నాయకుడు కి టికెట్ కేటాయించడం విశేషం.
ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ని పక్కన పెట్టారు. వరదాపురం సూరిని సైతం సైడ్ చేశారు. బిజెపి నేత సత్య కుమార్ కు టికెట్ కేటాయించారు. ఈయన చంద్రబాబుకు అత్యంత విధేయమైనా నేత. ఎల్లో మీడియాలో జగన్ పై వ్యతిరేక వార్తలు రాస్తుంటారు. అందుకే ఈయనకు టికెట్ కట్టబెట్టినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అనంతపురం లోకల్ బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం మొండి చేయి చూపారు. ఈయనపై ప్రోవైసిపీ ముద్ర ఉంది. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తును వ్యతిరేకించిన నాయకుల్లో విష్ణువర్ధన్ రెడ్డి ముందంజలో ఉంటారు. అందుకే ఆయన పేరును టిక్కెట్ కు పరిగణలోకి తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎక్కువ శాతం టిడిపి విధేయులు ఉండడం గమనార్హం.