Battery Powered Cycle: విజయనగరం జిల్లాకు( Vijayanagaram district) చెందిన ఓ ఇంటర్ విద్యార్థి తక్కువ ఖర్చుతో బ్యాటరీ అమర్చిన సైకిల్ ను రూపొందించాడు. కేవలం ఆరు రూపాయల ఖర్చుతో 80 కిలోమీటర్లు నడిచే సైకిల్ ను తయారు చేశాడు. ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేందుకు వ్యయ ప్రయాసలకు గురి కావడంతో తానే సొంతంగా సైకిల్ కు బ్యాటరీ అమర్చి సక్సెస్ అయ్యాడు. అయితే ఇది ఆ నోట ఈ నోట బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ విద్యార్థి ప్రతిభ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిచి మరి ఆ విద్యార్థిని అభినందించారు. అయితే ఇప్పుడు ఇదే రకమైన సైకిళ్ల ను విద్యార్థులకు అందిస్తే రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని.. పేద విద్యార్థులపై భారం తగ్గుతుందని టాక్ వినిపిస్తోంది.
విజయనగరం విద్యార్థి నైపుణ్యం..
విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన రాజాపు సిద్దు( Sidhu) అనే విద్యార్థి రాజాం పట్టణంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఆయన స్వగ్రామం మారుమూల ప్రాంతంలో ఉంది. ప్రతిరోజు కాలేజీకి వెళ్లాలంటే బస్సులు మారాల్సి ఉంటుంది. పైగా సిద్దు తల్లిదండ్రులు వలస కూలీలు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ తరుణంలో ఉదయం కాలేజీకి చేరేందుకు సమయం పడుతుంది. తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో కూడా చీకటి పడుతోంది. దీంతో సరికొత్త ఆలోచన చేశాడు. తనకున్న సైకిల్ కు బ్యాటరీని అమర్చాడు. గంటసేపు చార్జింగ్ పెడితే వాహనం నడిచేలా తీర్చిదిద్దాడు. కేవలం ఆరు రూపాయలతో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సిద్ధూను పిలిచి అభినందించారు. ఆయన రూపొందించిన బ్యాటరీ సైకిల్ను తొక్కి బాగుందని కితాబిచ్చారు. లక్ష రూపాయలు పారితోషికంగా కూడా అందించారు.
Also Read: సక్సెస్ కావాలంటే ఆ సమయం వరకు వెయిట్ చేయక తప్పదు..
సోషల్ మీడియాలో సరికొత్త డిమాండ్..
అయితే ఈ విషయం సోషల్ మీడియాలో( social media) వైరల్ కావడంతో.. ఎక్కువ మంది స్పందిస్తున్నారు. సిద్ధూను అభినందిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇటువంటి బ్యాటరీ అమర్చిన సైకిళ్లను విద్యార్థులకు అందిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. గతంలో విద్యార్థులకు టిడిపి ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు.. ఈ బ్యాటరీ సైకిళ్లను అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటుందో? లేదో చూడాలి.