Kerala Old Age Home: ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎలా పడుతుందో తెలియదు. ప్రేమకు కారణం అంటూ ఉండదు. ఎదుటి వ్యక్తి పై ప్రేమ ఎందుకు కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. కులంతో సంబంధం ఉండదు. ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని ఆస్వాదించాలి. ప్రేమను తనువితీరా గుండెలలో నింపుకోవాలి. ప్రేమించిన వారిని గుండెలకు హత్తుకోవాలి. కట్టె కాలేవరకు.. మన్నులో కలిసే వరకు ప్రేమను చూపిస్తూనే ఉండాలి.
నేటి కాలంలో ప్రేమ అనేది ఒక ఇన్స్టంట్ వస్తువు లాగా మారిపోయింది. త్యాగానికి.. భరోసా కు చిరునామాగా ఉండాల్సిన ప్రేమ విలువ కోల్పోతుంది. శారీరక సుఖాన్ని అందించడానికి మాత్రమే పనికి వస్తున్నది. త్యాగాన్ని కోరుకునే ప్రేమ హింసాత్మకంగా మారుతున్నది. నచ్చిన అమ్మాయి నో చెబితే ఎంతకైనా దిగజారడానికి ప్రేమికులు వెనకాడటం లేదు. కానీ ఇలాంటి కాలంలో ప్రేమకు అసలైన నిర్వచనం చెప్పారు ఈ జంట. ప్రేమిస్తే ఎలా ఉండాలో.. ప్రేమను ఎలా సార్ధకం చేసుకోవాలో నిరూపించారు..
కేరళ రాష్ట్రంలోని రామవర్మాపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 సంవత్సరాల విజయ రాఘవన్, 75 సంవత్సరాల సులోచన మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీనితో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా ఒక్కటయ్యారు. వీరి వివాహానికి కేరళ రాష్ట్ర మంత్రి ఆర్ బిందు, నగర మేయర్ వర్గీస్, ఇతర అధికారులు హాజరయ్యారు.. వీరి వివాహాన్ని ఒక పండుగలాగా జరిపారు. విజయ రాఘవన్ కు గతంలో పెళ్లయింది. సులోచనకు కూడా పెళ్లి జరిగింది. విజయ రాఘవన్ భార్య అనారోగ్యంతో కన్ను మూసింది. సులోచన భర్త కూడా అలానే మృతిచెందాడు. వీరి కుటుంబాలలో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో వారిద్దరు రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమానికి వచ్చారు. వారు ఇక్కడే ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లారు. వివాహం జరుపుకొని ఒక్కటయ్యారు. ఈ దంపతుల కుటుంబ సభ్యుల గురించి బయటకు చెప్పడానికి అక్కడి అధికారులు నిరాకరించారు. ఆ విషయాలు తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించినప్పటికీ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. దీంతో మీడియా ప్రతినిధులు కూడా సైలెంట్ అయిపోయారు.
Also Read: యుద్ధం చేయకుండానే చనిపోతున్నారు.. ఆందోళన కలిగిస్తున్న యువ పైలట్ల దుర్మరణం!
“ప్రేమకు వయసుతో సంబంధం లేదు. కులాలతో సంబంధం లేదు. నేపథ్యాలతో సంబంధం లేదు. మనుసులు నచ్చితే సరిపోతుంది. అది మనుషులను కలుపుతుంది. నేటి కాలంలో ప్రేమకు అర్థం మారిపోయింది. వీరిద్దరూ ప్రేమకు సరికొత్త అర్థం చెప్పారు. అంతేకాదు ఈ కాలం యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచారు. వీరు తమ గొప్పతనాన్ని అద్భుతంగా నిరూపించుకున్నారు. వారు తమ తదిపరి జీవితాన్ని కూడా గొప్పగా కొనసాగించాలి. గొప్ప జీవితాన్ని తుదికంటా ఆస్వాదించాలని” కేరళ మీడియా పేర్కొంది.