Baptla : ఏపీలో వైసీపీ శ్రేణుల దాష్టీకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తమకు అడ్డొచ్చేదెవరు? అడ్డగించేదెవరు? అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. కేసులు నమోదు చేయిస్తున్నారు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎదురుతిరిగితే విధ్వంసాలకు దిగుతున్నారు. వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అటు పోలీసులు సైతం బాధితులకు రక్షణ కల్పించలేకపోతున్నారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదుచేసి రాజకీయ సెల్యూట్లు చేస్తున్నారు. చివరకు కోర్టులు కలుగజేసుకొని న్యాయం చేయాలని ఆదేశిస్తున్నా బేఖాతరు చేస్తున్నారు.
తాజాగా బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఓ ముక్కుపచ్చలారని బాలుడ్ని వైసీపీ నేత ఒకరు బలిగొన్నారు. ప్రేమ పేరుతో తన అక్కను వేధించవద్దని అడిగినందుకు వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి చదువుతున్న బాలుడిపై యాసిడ్ తో దాడిచేశాడు. రోడ్డు మీద సైకిల్ పై వెళుతున్న బాలుడ్ని అటకాయించి మరీ యాసిడ్ పోశాడు. ఆ మంటలకు తట్టుకోలేని ఆ పసి హృదయం విలవిల్లాడిపోయింది. వద్దు అని కాళ్లవేళ్లా పడినా ఆ కఠిన హృదయం కనికరించలేదు. తనలో ఉన్న కాఠిన్యాన్ని ప్రదర్శించి ముక్కుపచ్చలారని బాలుడ్ని చిదిమేశాడు.
ఆ బాలుడు చనిపోతూ మాట్లాడిన మాటలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతిఒక్కరి మనసును కలిచివేస్తున్నాయి. 90శాతానికిపైగా కాలిన గాయాలతో ఆ బాలుడు ధైర్యంగా మాట్లాడాడు. మరణ వాంగ్మూలం ఇచ్చాడు. తన అక్కను వేధిస్తున్నారని వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డిని ప్రశ్నించినందుకే ఈ దురాగతానికి పాల్పడినట్టు బాలుడు చెప్పుకొచ్చాడు. సైకిల్ పై వెళుతున్న తనను వెంటాడి, వేటాడి యాసిడ్ దాడికి పాల్పడ్డారని చెప్పాడు. అతడికి శిక్షపడాలని కోరాడు.
మరికొద్ది క్షణాల్లో ప్రాణాలు పోతుండగా.. ఆ బాలుడి ధైర్యం పోగుచేసుకొని తన మనసులో ఉన్న ఆవేదనను వెళ్లగక్కాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆ బాలుడి కళ్లల్లో ధైర్యం కనిపించింది. మాటల్లో ఆ వైసీపీ నేత దాష్టీకం వెల్లడైంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇది పరాకాష్ట అని కామెంట్స్ చేస్తున్నారు. తక్షణం నిందితుడ్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై విపక్షాలు సైతం పోరాటానికి సిద్ధపడుతున్నాయి.