AP Talliki Vandanam Update: కూటమి ప్రభుత్వం( Alliance government ) రేపటితో ఏడాది పాలన పూర్తిచేసుకోనుంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. టిడిపి కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. అదే నెల 12న సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాదిగా విప్లవాత్మకమైన పాలనతో కూటమి ముందుకు సాగుతోంది. గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేయగలిగింది. ముఖ్యంగా అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున పట్టాలు ఎక్కించగలిగింది. అమరావతి రాజధాని నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గత నెలలోనే ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే రేపటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో సంక్షేమ పథకాలు వరుసుగా అమలు చేయాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టారు. అందులో కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ఈ నెల నుంచి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. అయితే రేపటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ఈ మేరకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి..
తాము అధికారంలోకి వస్తే పిల్లల చదువుకు పెద్ద ఎత్తున సాయం అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15వేల రూపాయల చొప్పున సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనాన్ని చేర్చారు. ఇప్పుడు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 67,27, 164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించనుంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లు జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. అయితే ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి.. ఇంటర్ ఫస్టియర్ లో చేరే విద్యార్థులకు సైతం తల్లికి వందనం వర్తించనుంది. అడ్మిషన్లు పూర్తయినట్టు డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం 2 పథకాలను అమలు చేసి చూపింది కూటమి సర్కార్. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేసి ఏపీలో చరిత్ర సృష్టిస్తోంది.
Also Read: RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు: జగన్ ఒక్కడే కాదు.. అందరూ నేతల రాజకీయాలూ వాటితో ముడిపడినవే!
అమ్మ ఒడిలో కోత..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం అమ్మ ఒడి పేరిట ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే అప్పట్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. కేవలం ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం చేశారు. అది కూడా తొలి ఏడాది మాత్రమే 15 వేల రూపాయలు అందించారు. అటు తరువాత పాఠశాలల అభివృద్ధి పేరిట 2000 రూపాయలు కోత విధించారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చిన మాదిరిగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తించేలా నిర్ణయం తీసుకోవడం విశేషం. మరోవైపు తల్లికి వందనం పథకంపై విపక్షాలు విష ప్రచారం చేశాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ప్రచారం చేసింది. సోషల్ మీడియా వేదికగా కూడా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. కానీ వాటన్నింటిని అధిగమిస్తూ కూటమి సర్కార్ నిధులు సమీకరించింది. వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు కేటాయించింది. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సిద్ధపడింది.
Also Read: CM Chandrababu: జగన్ అరెస్ట్.. చంద్రబాబుకు కేంద్ర పెద్దల సూచన అదే!
మరో రెండు పథకాలు సైతం..
రేపటితో కూటమి ఏడాది పాలన పూర్తి కానుంది. ఇదే రోజు విద్యా సంవత్సరం( academic year ) కూడా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 24 న విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. దాదాపు 50 రోజుల విరామం అనంతరం ఈరోజు విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. సరిగ్గా ఇదే రోజు తల్లికి వందనం పథకం అమలు చేస్తుండడం శుభపరిణామం. అయితే ఒక్క తల్లికి వందనం కాదు.. విద్యార్థులకు సంబంధించి మరో రెండు పథకాలను సైతం అమలు చేయనుంది కూటమి సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్నం భోజనం గా అందించనుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు లక్షలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు నిర్ణయించింది. మరోవైపు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ల కింద 11 రకాల వస్తువులు, పాఠ్యపుస్తకాలతో కిట్లను కూడా అందించనుంది. మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం విద్యా సంక్షేమం విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనిపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.