AP Rains: ఏపీ వాసులకు చల్లటి వార్త. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతాన్ని( Bay of Bengal) తాకాయి. దక్షిణ ప్రాంతంగా ఉన్న అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. ప్రస్తుతం ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని.. అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో అరేబియా, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు అంతట రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు కేరళను సైతం ఈనెల 27 నాటికి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వివరించింది. రుతుపవనాలు చురుగ్గా కదిలితే దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: పాక్ తో యుద్ధం అదానీని అమాంతం పైకి లేపిందిగా..
* ఏపీలో ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోవైపు అండమాన్కు( Andaman Nicobar) రుతుపవనాలు తాకనున్న నేపథ్యంలో ఏపీకి సైతం.. భారీ వర్ష సూచన కనిపిస్తోంది. ప్రధానంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు, తూర్పు, పశ్చిమగోదావరి, కడప, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తరాంధ్రకు సైతం వర్ష సూచన ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అంబేద్కర్ కోనసీమతో పాటు పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
* ఉత్తర కోస్తాలో మారిన వాతావరణం..
అయితే ఉత్తర కోస్తాలో( North coastal ) ఇప్పటికే ఆకాశం మేఘావృతం అయింది. భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షం పడే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున భారీ హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర నిలబడ వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. అకాల వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి పంటకి దెబ్బతప్పలేదు.
* ఉష్ణోగ్రతలు అదే స్థాయిలో..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు( temperatures ) అమాంతం పెరిగాయి. వందలాది ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయింది. కొన్ని జిల్లాల్లో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతూ కనిపించారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలు కూడా వీస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.