AP Liquor Scam Explained: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని కూటమి అనుమానించింది. ప్రాథమికంగా వివరాలు సేకరించి తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్దిరోజులుగా దర్యాప్తు చేస్తున్న ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం 12 మంది నిందితులను అరెస్టు చేసింది. మొత్తం 40 మంది నిందితులకు గాను.. కేసులో కీలక పాత్ర పోషించిన వారిని అరెస్టు చేయగలిగింది. ఈ మొత్తం కుంభకోణంలో 18 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని.. 3,500 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారని చెబుతూ తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈరోజు రెండో ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించనుంది. ప్రధానంగా ముగ్గురు వ్యక్తులకు సంబంధించి అవినీతి ఎలా చేశారో పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చార్జ్ షీట్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే మళ్లీ విడత చార్జ్ షీట్ కు సంబంధించి మరో మూడు వారాల్లో కోర్టులో నివేదిస్తారని సమాచారం.
Also Read: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు తారక్.. వైసీపీకి భలే ఛాన్స్!
విజయసాయిరెడ్డి వాంగ్మూలం తో..
మద్యం కుంభకోణంలో( liquor scam ) రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడు. ఆయనే సూత్రధారి అని నిర్ధారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. మద్యం వ్యాపారంలో ఆరితేరిన రాజ్ కసిరెడ్డిని అప్పటి ప్రభుత్వ పెద్దలు ముడుపుల వ్యవహారాన్ని అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అరెస్ట్ చాలా నాటకీయంగా జరిగింది. ఈ కేసులో ఏ 5 నిందితుడు విజయసాయిరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత అయిన విజయసాయిరెడ్డి కాకినాడ సి పోర్ట్ కేసు విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంలోనే ఆయన చెప్పుకొచ్చారు రాజ్ కసిరెడ్డి గురించి. మొత్తం ఈ కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని.. హైదరాబాద్ వేదికగా అనేక సిట్టింగులు జరిగాయని.. తాను సైతం ఆ సిట్టింగ్లలో పాల్గొన్నానని.. కానీ తనకు ఆ కుంభకోణంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇలా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారో లేదో.. మద్యం కుంభకోణం కేసులో భారీ అరెస్టులు జరిగాయి. ముఖ్యంగా అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు.
Also Read: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
పక్కా ఆధారాలతో..
అయితే ఈ రెండో ఛార్జ్ షీట్ లో ధనుంజయ రెడ్డి( dhanunjaya Reddy ), కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్ర గురించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలతో నివేదించినట్లు తెలుస్తోంది. మద్యం డిష్టలరీలతో సమావేశాలు జరిగినప్పుడు నేరుగా అప్పటి సీఎం ఓ అధికారి ధనంజయ రెడ్డి పాల్గొనేవారని.. అలా వచ్చిన ముడుపులలో తన వాటాగా వచ్చిన సొమ్మును సొంత కారులో తరలించేవారు అని.. ఆ సొమ్ముతో హైదరాబాద్ తో పాటు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని పక్కా ఆధారాలు సేకరించింది సిట్. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి నేరుగా డిస్టలరీల నుంచి ముడుపులు వసూలు చేసి అంతిమ లబ్ధిదారుడుకు తరలించే వారని.. ఆయన సైతం తన వాటాగా వచ్చిన సొమ్మును వ్యాపారాలకు వినియోగించారని సిట్ గుర్తించింది. బాలాజీ గోవిందప్ప మాత్రం ఒక వ్యూహాత్మకంగా మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్మును వ్యాపారాలకు మరల్చారని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. అయితే ఈ ముగ్గురికి సంబంధించి ఆధారాలను సీట్ గుర్తించిందని.. వాటితోనే ఈరోజు చార్జ్ షీట్ దాఖలు చేసిందని తెలుస్తోంది.