Drones : డ్రోన్ లను పలుదేశాలు యుద్దాలలో వాడుతున్నాయి. ఆర్మీ ఆపరేషన్లలో ఉపయోగిస్తున్నాయి. సరుకుల రవాణాలో వాడుకుంటున్నాయి. ఇటీవల రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రెండు దేశాలు పరస్పరం డ్రోన్ లను ప్రయోగించాయి. వీటిలో అత్యంత శక్తివంతమైన పే లోడ్ లు అమర్చడం వల్ల పేలుళ్లు సంభవించాయి. దీంతో నష్టం అపారంగా సంభవించింది. ఇక ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు దేశాలు కూడా డ్రోన్ లను వినియోగిస్తున్నాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అయితే మనదేశంలో డ్రోన్ ల వినియోగం రక్షణ శాఖలో ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని ప్రాంతాలలో వీటిని విభిన్నమైన పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పంటల సాగులో పురుగుల మందుల పిచికారిలో వీటిని ఉపయోగిస్తున్నారు. ఇటీవల విజయవాడ నగరంలో వరదలు చోటు చేసుకున్నప్పుడు.. నిత్యావసరాలు, ఇతర సరుకులు రవాణా చేయడానికి డ్రోన్ లు ఉపయోగించారు. అయితే వీటి వినియోగం ఇప్పుడు మరో వైపు టర్న్ తీసుకుంది. దీంతో చాలామంది డ్రోన్ లను ఇలా కూడా వాడతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా కూడా ఉపయోగిస్తారా..
డ్రోన్ ల వినియోగం లాజిస్టిక్ విభాగంలో పెరిగిపోయింది. పెద్ద పెద్ద సంస్థలు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. అధునాతన డ్రోన్ లు తయారు చేస్తూ సరుకు రవాణాలో ఉపయోగిస్తున్నాయి. ఇక ఇటీవల విజయవాడ నగరంలో వరదలు సంభవించినప్పుడు వాహనాలు వెళ్లలేని చోటుకు ఈ డ్రోన్ లను ఉపయోగించారు. అపార్ట్మెంట్ల వద్దకు పంపించి ఆహారాన్ని అందించారు. అయితే గుంటూరులో డ్రోన్ ద్వారా మరో కార్యక్రమానికి నాంది పలికారు. దూర ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు పంపిణీ చేసేందుకు డ్రోన్ ను ఉపయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. డ్రోన్ ను చిన్న విమానం రూపంలో రూపొందించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అన్నవరపు లంక అనే ఆయుష్మాన్ కేంద్రానికి 10 కిలోల బరువు ఉన్న టీకాలు, ఇతర మందులను అందులో స్టోర్ చేసి పంపించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే డ్రోన్ మున్నంగి ప్రాంతం నుంచి అన్నవరపు లంకకు వెళ్ళిపోయింది. అన్నవరపు లంక కృష్ణ నది మధ్యలో ఉంటుంది. మామూలు రోజుల్లో ఈ గ్రామానికి సులభంగానే చేరుకోవచ్చు. కృష్ణా నదికి వరదలు వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. పడవలో ఆ గ్రామానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు. అందువల్లే అత్యవసర సమయంలో ఇలా డ్రోన్ ద్వారా మందులను పంపించారు. ఈ ప్రయోగాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు లక్ష్మీ సుధా, తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీవో విజయలక్ష్మి పర్యవేక్షించారు. అయితే ఇక్కడ డ్రోన్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో.. రాష్ట్ర మొత్తం ఇదే విధానాన్ని అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని చెందిన అధికారుల బృందం ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది.