Shubman Gill journalist incident: వెన్నెల ఉన్నన్ని రోజులు చీకటి జాడ కనిపించదు. అమావాస్య ఉన్నన్ని రోజులు వెన్నెల చోటు దర్శనమివ్వదు. అంటే వెలుగు శాశ్వతం కాదు.. చీకటి ఎప్పటికీ ఉండదు. ఇవి మాత్రమే కాదు గెలుపు ఓటములు కూడా అంతే. కొన్ని సందర్భాలలో గెలుపులు లభిస్తాయి.. ఇంకొన్ని సందర్భాలలో ఓటములు ఎదురవుతాయి. గెలిచినప్పుడు విర్రవీగొద్దు. ఓడిపోయినప్పుడు కుంగుబాటుకు గురికావద్దు.. లీడ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్లో భారత్ గెలుపుకు దగ్గరగా వచ్చింది. చివరి దశలో ఒత్తిడికి గురై ఓటమిపాలైంది. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకుంది.. రెండవ టెస్టులో గెలుపును దక్కించుకుంది. మూడవ టెస్ట్ కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తోంది. ఈనెల పది నుంచి మూడవ టెస్ట్ మొదలవుతుంది.
Also Read: మూడో టెస్టులో వాళ్ళిద్దరికీ మూడింది.. బుమ్రా, అర్ష్ దీప్ ఎంట్రీ ఖాయం.. తేల్చేసిన గిల్
రెండవ టెస్ట్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా భారత ప్లేయర్లు వదిలిపెట్టలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. అదే సమయంలో సమర్థవంతంగా ఫీల్డింగ్ చేశారు. ఇక బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలిసారిగా విదేశీ మైదానాల్లో అత్యంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా దూకుడు తనాన్ని ప్రదర్శించారు. బంతి గమనాన్ని ముందుగానే అంచనా వేసి పరుగులు తీశారు.
ఇన్ని ఘనతలు సాధించింది కాబట్టి టీం ఇండియా చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఎదుట ఉంచింది. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కూడా అంతే నేర్పరితనాన్ని ప్రదర్శించింది. ఫలితంగా అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెనా (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) విభాగంలో అత్యంత భారీ వ్యత్యాసంతో గెలుపును సొంతం చేసుకుంది.. టీమిండియా భారీ వ్యత్యాసంతో విజయం సాధించిన నేపథ్యంలో.. సారధి గిల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ సమయంలోనే ఒక విలేఖరి ప్రస్తావనను గిల్ తీసుకొచ్చాడు.
ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ప్రారంభానికి ముందు ఇంగ్లీష్ జర్నలిస్ట్ గిల్ ను పదేపదే ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగాడు..”మీరు తొలి టెస్ట్ ఓడిపోయారు. ఈ వేదిక మీద మీ రికార్డు అంత గొప్పగా లేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో మీరు విజయం సాధించలేదు. పైగా బౌలింగ్లో బుమ్రా కూడా లేడు. అలాంటప్పుడు మీరు ఇక్కడ విజయం ఎలా సాధిస్తారు? మీకు విజయం సాధించే సామర్థ్యం ఉందా?” అని ప్రశ్నించాడు..గిల్ అతడి ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నప్పటికీ.. ఆ జర్నలిస్ట్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా టెస్ట్ క్రికెట్లో ఇండియా ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది అనే విధంగా ప్రశ్నలు అడిగాడు. ఒక రకంగా గిల్ అతని ప్రశ్నలకు చిరాకు పడినప్పటికీ.. దానిని చూపించలేకపోయాడు. చివరికి టెస్ట్ మ్యాచ్ గెలిపించి.. ఆ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు విజయం ద్వారా సమాధానం చెప్పాడు.
Also Read: ఇంగ్గాండ్ ఓటమిపై బెన్ స్టోక్స్ సంచలన కామెంట్స్
విలేకరుల సమావేశంలో ఆ జర్నలిస్ట్ కనిపించకపోవడంతో గిల్ ఆరా తీశాడు. ” ఆ జర్నలిస్టు ఎక్కడ? నన్ను పదే పదే ప్రశ్నలతో వేధించిన అతడు ఎక్కడ? అతడిని నేను చూడాలని ఉంది. అతడితో మాట్లాడాలని ఉంది.. అతడి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉన్నదని” గిల్ పేర్కొన్నారు. అయితే గిల్ మాట్లాడిన మాటలు తోటి విలేకరులకు నవ్వు తెప్పించాయి. ఆ తర్వాత గిల్ మ్యాచ్ సాగిన తీరు, ఆటగాళ్ల ప్రదర్శన, మైదానంలో ఎదురైన అనుభవాలను విలేకరులతో పంచుకున్నాడు. అద్భుతమైన మ్యాచ్ ఆడామని పేర్కొన్నాడు.