AP Summer Weather Updates 2026: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు వేసవి తీవ్రత మొదలైంది. ఇంకోవైపు వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు అవుతూ వస్తోంది. అయితే వర్ష ప్రభావిత ప్రాంతాలు తప్పించి మిగతా చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతోంది. అయితే మధ్యాహ్నం వరకు ఎండలు ఉండగా.. సాయంత్రానికి ఒక్కసారిగా మేఘావృతమై వర్షాలు పడుతున్నాయి.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
* పిడుగులతో కూడిన వాన..
ఈరోజు చాలాచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రధానంగా కోస్తాంధ్రలోని కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే వర్షాలకు తోడు ఈదురు గాలులు, పిడుగులు, ఉరుములు కురుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వేసవిలోనే ఈ పరిస్థితి ఉంటే జూన్ తరువాత పిడుగుల మోత తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.
* ముందస్తు హెచ్చరికలు..
మరోవైపు విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే హెచ్చరిస్తోంది. ఇప్పటికే సెల్ ఫోన్ వినియోగదారులకు ముందస్తు హెచ్చరికలు పంపుతోంది. ఈరోజు వర్షం పడే ప్రాంతాల్లో పిడుగులు కూడా పడతాయని హెచ్చరిస్తోంది. రైతులు వ్యవసాయ పనుల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తోంది. ముఖ్యంగా వరి,మిర్చి, మొక్కజొన్న వంటి పంటలను బయట ఆరబెట్టుకుని ఉంటే.. వాటిని సంరక్షించుకోవాలని సూచించారు. రైతులతో పాటు కూలీలు బహిరంగంగా పొలాల్లో పని చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలని.. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. మరో మూడు రోజులపాటు వాతావరణం ఇలానే కొనసాగనుంది. అయితే ఒకవైపు వానలు పడుతున్న రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం.
