Ap Weather : ఏపీలో ( Andhra Pradesh) విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. రుతుపవనాల కదలిక నెమ్మదించింది. దీంతో క్రమేపి వేడి పెరుగుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఉక్కపోత అధికంగా ఉంది. జూన్ 12 నుంచి ఉత్తర కోస్తా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వాతావరణం లో ఈ విచిత్ర పరిస్థితులను చూస్తున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే గతం కంటే ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ సూచించడం ఉపశమనం కలిగించే విషయం. తాజాగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించారు. వరి ఆకుమడులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. అయితే ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు దేశంతో పాటు రాష్ట్రాన్ని తాకడం హర్షించదగ్గ పరిణామం.
* వేడి ప్రారంభం..
రుతుపవనాలు ఏపీలో ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పుడు రుతుపవనాలు నెమ్మదించడంతో వేడి ప్రారంభం అయ్యింది. కొన్ని జిల్లాల్లో ఎండలు( temperatures ) అదరగొడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read : అమ్మ నిత్యానందా.. అదొక్కటే అనుకున్నాం.. ఈకళలోనూ ఆరితేరావా?
* ముందుగానే రుతుపవనాలు..
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు దేశానికి తాకాయి. బంగాళాఖాతం తో( Bay of Bengal) పాటుగా అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా ఒడిస్సా వరకు కదిలాయి. కానీ గత రెండు రోజులుగా నైరుతి రుతుపవనాల కదిలిక నెమ్మదించింది. పొడిగాలుల వల్ల వేగం తగ్గినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో, వర్షం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వేడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో ఉక్క పోత ప్రారంభం అయ్యింది. ఇదే పరిస్థితి వారం నుంచి పది రోజులు పాటు ఉంటుందని భావిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 12 వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రుతుపవనాలు నెమ్మదించడం వల్లే ఈ పరిస్థితి అని అంచనా వేస్తున్నారు.
* 11న అల్పపీడనం..
సాధారణంగా జూన్( June) నుంచి సెప్టెంబర్ వరకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. అందులో భాగంగా జూన్ 11 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో జూన్ 12 నుంచి 19 మధ్య ఉత్తర కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రత అమాంతం పెరిగింది. 36 డిగ్రీలకు దాటింది. రాయలసీమలోని తిరుపతిలో అత్యధికంగా 39.8°, కోస్తాలోని నెల్లూరులో 39.1°, మచిలీపట్నంలో 38.8° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడడంతో వేడి పెరుగుతోందని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం పార్వతీపురం మన్యం, పల్నాడు, శ్రీ సత్య సాయి జిల్లాలో కొద్దిపాటి వర్షం కురిసింది. అయితే ఈసారి వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.