Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) రాజకీయంగా చాలా రకాల సంచలనాలు నమోదు అవుతున్నాయి. పదవుల ఎంపికలో అనూహ్య వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవి ఓ మాజీ కౌన్సిలర్ కు కట్టబెట్టడం విశేషం. కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నం టు నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేశారు. ఆ పదవిని బిజెపి దక్కించుకుంది. అయితే ముందుగా స్మృతి ఇరానీ పేరు ప్రముఖంగా వినిపించింది. అటు తరువాత తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ అవేవీ కాకుండా అనూహ్య వ్యక్తి పేరును ప్రకటించింది భారతీయ జనతా పార్టీ.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* చివరికి బిజెపికి ఆ పదవి..
గత కొద్ది రోజులుగా నెలకొన్న చిక్కుముడి వీడింది. విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవిని బిజెపి దక్కించుకుంది. బిజెపి నేత పాక వెంకట సత్యనారాయణ ఎన్డీఏ కూటమి తరుపున రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా ఖరారు చేశారు. భీమవరానికి చెందిన వెంకట సత్యనారాయణ గతంలో కౌన్సిలర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది. దీంతో కూటమి తరుపున పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. మూడు నెలల కిందట విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ పదవికి సైతం రిజైన్ చేశారు. దీంతో కూటమిలో ఏ పార్టీకి ఆ సీటు దక్కుతుందో అని ఉత్కంఠ కొనసాగింది. చివరకు విజయసాయిరెడ్డి బిజెపిలో చేరి రాజ్యసభ పదవి పొందుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు.
* ప్రముఖంగా ఇద్దరి పేర్లు..
తమిళనాడు బిజెపి మాజీ చీఫ్ అన్నామలై( Annamalai) పేరు ప్రముఖంగా వినిపించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన దూకుడుగా ఉండేవారు. అయితే ఉన్నఫలంగా ఆయనను మార్చారు. రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని ప్రచారం జరిగింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అన్నామలైను ప్రమోట్ చేస్తారని అంతా భావించారు. మరోవైపు ఢిల్లీకి చెందిన మహిళ నేత స్మృతి ఇరానీ పేరు వినిపించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించడంతో ప్రధాని మోదీ ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పలేదు. అందుకే ఏపీ నుంచి రాజ్యసభకు ప్రమోట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా తెగ హడావిడి నడిచింది. కానీ ఆ ఇద్దరు నేతలను కాదని ఒక సామాన్య బీసీ నేత పాక సత్యనారాయణను( paaka Satyanarayana) ఎంపిక చేసింది బిజెపి హై కమాండ్.
* తెరపైకి మందకృష్ణ మాదిగ..
ఆది నుంచి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ పదవి కోసం బిజెపి పట్టు పట్టింది. చంద్రబాబుతో పాటు పవన్ కూడా ఉదారంగా వ్యవహరించారు. అయితే ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక ప్రతిపాదన చేసినట్లు ప్రచారం జరిగింది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ( Krishnam aadika ) పేరును చంద్రబాబు సిఫారసు చేసినట్లు టాక్ నడిచింది. కానీ చివరకు ఏపీకి చెందిన.. సీనియర్ నేత పేరును బిజెపి హై కమాండ్ ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా ఒక సామాన్య నేతకు పదవి ఇవ్వడం మాత్రం చిన్న విషయం కాదు. ఈ విషయంలో బిజెపి స్పష్టమైన సంకేతాలు పంపగలిగింది. పార్టీలో కష్టపడి, సీనియారిటీ సిన్సియారిటీ ఉన్న నేతలకు గుర్తింపు ఉంటుందని ఈ ఎంపిక ద్వారా తెలియజేసింది.
Also Read : ఏపీలో ఈశాన్య రాష్ట్రాల బస్సులు.. రూ.82.14 కోట్లకు టెండర్!