Amaravati Capital: అమరావతి రాజధాని పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను చూస్తున్న సి ఆర్ డి ఏ కార్యాలయానికి భూమి పూజ చేశారు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాజధాని నిర్మాణానికి 15000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి సాయం అందజేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 12 వేల కోట్ల రూపాయలను సమీకరిస్తోంది.గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది.జనవరి నుంచి నిరాటంకంగా పనులు పూర్తి చేయాలని చూస్తోంది. దీంతో అమరావతి రాజధాని రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
* స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది.అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు. చంద్రబాబు పిలుపునకు రైతులు స్పందించారు. స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి అందించారు. అమరావతి రైతుల భవిష్యత్తును తన భుజస్కందాలపై వేసుకున్నారు చంద్రబాబు. దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని తీర్చేందుకు నడుం బిగించారు.అయితే 2019లో రాష్ట్రంలో అధికార మార్పిడితో అమరావతి రాజధానికి శాపంగా మారింది. వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతి ఒక స్మశానంలా మారిపోయింది. రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. రైతులు పోరాట బాట పట్టారు. న్యాయపోరాటం చేశారు. చాలా రకాల ఇబ్బంది పడ్డారు. వారి ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
* అమరావతికి కొత్త కళ
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అంధకారంలో ఉన్న అమరావతికి కొత్త కళ వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ ప్రారంభం అయింది. దాదాపు 33 కోట్ల రూపాయలతో 50వేల ఎకరాల భూమిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశారు. అమరావతిని యధాస్థానానికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పనులు పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నిధుల సమీకరణ ఈజీ అవుతోంది. ఈ తరుణంలోనే శరవేగంగా పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించుకుంది కూటమి ప్రభుత్వం. ఒప్పందాలకు తగ్గట్టు రైతులకు సైతం మేలు చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. దీంతో అమరావతి రైతుల కళ్ళల్లో కొత్త ఆనందం తొణికిసలాడుతోంది.