Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బిగ్ షాక్. ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఆదివారం ఉదయం నుంచి జరిగిన సుదీర్ఘ వాదనల అనంతరం సాయంత్రం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అటు సిఐడి.. ఇటు చంద్రబాబు తరుపు లాయర్లు బలమైన వాదనలు వినిపించారు. ఉదయం నుంచి ఏడున్నర గంటలపాటు ఇరువాదనలు విన్న కోర్ట్ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో తీర్పును రిజర్వులో పెట్టింది. అక్కడ కు మూడు గంటల తర్వాత తీర్పును వెల్లడించింది. చంద్రబాబుకు14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.ఈనెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ లో ఉండనున్నారు.ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉండగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు అరెస్టుకు సిఐడి నోటీసులు ఇచ్చింది. దీంతో అక్కడి నుంచి హైడ్రామా నడిచింది. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి చంద్రబాబు కాన్వాయ్ తో పాటే విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు. అక్కడ సుదీర్ఘ సమయం పాటు చంద్రబాబును విచారించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం నేరుగా ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఉదయం కోర్టుకు రాగానే చంద్రబాబు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు అనుమతి తీసుకుని స్వయంగా వాదనలు కూడా ఆయనే వినిపించుకున్నారు. అనంతరం ఇరు వర్గాల వాదనలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిఐడి తరపు న్యాయవాది ఏఏజి వన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూధ్ర వాదనలు వినిపించారు. అయితే 7:30 గంటల పాటు సాగిన విచారణలో.. మూడు గంటలపాటు ఏకతాటిగా సిద్ధార్థ్ వాదనలు వినిపించ గలిగారు. అసలు ఈ కేసు కథ ఏంటి? గవర్నర్ అనుమతి లేనిది ఎలా అరెస్టు చేశారు? సెక్షన్ 4 0 9 అంటే ఏంటి? అసలు సిఐడి కి అరెస్టు చేసే విధానం తెలుసా? ఇలా పలు కేసులను ఉదహరించి మరి సిద్ధార్థ్ వాదనలు వినిపించారు. కానీ వాటిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు.
ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి రిమాండ్ ఇచ్చే పరిస్థితి లేదని.. తప్పకుండా వస్తుందని విశ్లేషణలు వచ్చాయి. 2021 లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో ఇదివరకే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే కేసును మళ్లీ రీఓపెన్ చేసి.. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరుని చేర్చి నిందితుడిగా చూపారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా షాక్కుకు గురయ్యారు. అటు టిడిపి శ్రేణుల్లో సైతం నైరాశ్యం అలుముకుంది. చంద్రబాబును తరలించేందుకు ముందస్తుగానే భారీ కాన్వాయ్ ని ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. పారా మిలటరీ బలగాల నడుమరాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.