G20 Meetings : న్యూఢిల్లీ వేదికగా భారత్ మండపంలో అంగరంగ వైభవంగా జరిగిన 18వ జీ_20 సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు సభలో ప్రసంగించారు. భాగస్వామ్య దేశాలకు, తరలి వచ్చిన వివిధ దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 19వ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి అధ్యక్ష బాధ్యతను బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగించారు. భారత్ కు 18వ అధ్యక్ష బాధ్యతలు, శిఖరాగ్ర సమావేశం నిర్వహించే అవకాశం లభించడం గొప్ప విషయం అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్ ఆహ్వానం అందించగానే వివిధ దేశాలకు చెందిన అధినేతలు తరలివచ్చారని, వందల ఏలనాటి చరిత్ర ఉన్న భారత్ ఆతిథ్యాన్ని స్వీకరించారని ఆయన వివరించారు. ఈ స్ఫూర్తిని ప్రతి భారతీయుడు కొనసాగిస్తాడని, ఈ సుహృద్భావ వాతావరణం ఎప్పటికీ గుర్తు ఉంటుందని ఆయన వివరించారు.
తొలిసారి భారత్ లో..
జి _ 20 సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రెండు రోజులపాటు ఉత్సాహంగా సమావేశంలో కలియ దిరిగారు. ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర దేశాల అధినేతలతో కలిసి మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు.. అనంతరం జరిగిన పలు చర్చల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బై డెన్ మొట్టమొదటిసారి భారత్ లో పర్యటించారు. ఇక్కడ పర్యటన ముగిసిన తర్వాత వియత్నాం బయలుదేరి వెళ్లారు. సమావేశం మొదలైన రోజే ఆయన మోడీ తో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
వివిధ దేశాల అధిపతులతో..
జీ_20 సమావేశాలు జరుగుతుండగానే.. మోడీ పలువురు ప్రపంచ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు మారిషస్, బంగ్లాదేశ్ అధిపతులతో చర్చలు జరిపారు. రెండవ రోజున యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. కాగా, ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో ప్రధాని లంచ్ సమావేశం ముగిసిన తర్వాత..కెనడా అధినేతతో చర్చలు జరిపారు. అనంతరం కొమొరోస్, తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటారు.
రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. సమావేశాలు తొలి రోజునే ప్రధాని ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భాగస్వామ్య దేశాలు ఏకాభిప్రాయానికి రావడం భారత్ సాధించిన అతిపెద్ద విజయం. సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని ప్రతిపాదించిన “వన్ ఎర్త్ నేషన్” పై సభ్య దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.