ABN RK Kotha Paluku: ఆంధ్రజ్యోతి పేరు ప్రస్తావనకు రాగానే టిడిపి మౌత్ పీస్ మాట మదిలో మెదులుతుంది. పైగా ప్రతి సందర్భంలోనూ టిడిపికి ఆపత్రిక అండగా నిలిచింది. అందువల్ల టిడిపి నాయకులు ఆంధ్ర జ్యోతిని తమ సొంత పత్రికగా భావిస్తుంటారు. చివరికి నారా చంద్రబాబునాయుడు కూడా ఆంధ్రజ్యోతి ఉద్యోగులకు విశేషమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అయితే ఆంధ్రజ్యోతి క్రమక్రమంగా చంద్రబాబుకు దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు. సాక్షాత్తు ఆంధ్ర జ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఇస్తున్న సంకేతాలు. తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి రాధాకృష్ణ వ్యతిరేకమైన కథనాలను రాస్తున్నారు. తాజా కొత్త పలుకులోనూ ఆయన అదే భావనను వ్యక్తీకరించారు.
Also Read: టీ బీజేపీలో కలహాలు.. రామచందర్‌రావు గుర్తించట్లేదా?
ఎమ్మెల్యేల దోపిడి పెరిగిపోయిందట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల దోపిడి పెరిగిపోయిందని రాధాకృష్ణ తాజా కొత్త పలుకులో ఆరోపించారు. ఆరోపణలకే పరిమితం కాకుండా.. పకడ్బందీ ఆధారాలతో పలు విషయాలను చెప్పారు. ఏపీలో ఎమ్మెల్యేలు ఇసుక నుంచి మొదలు పెడితే మట్టి వరకు అన్నిట్లోనూ వేలు పెడుతున్నారని.. అడ్డగోలుగా సంపాదిస్తున్నారని.. ఇటువంటి ఎమ్మెల్యేలను కట్టడి చంద్రబాబు వాళ్ళ కావడం లేదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అయితే ఎమ్మెల్యేలకు ఎలా స్వేచ్ఛ ఇచ్చారో.. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంతకుమించి అనే స్థాయిలో స్వేచ్ఛను అనుభవిస్తున్నారని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. ఇలానే ఉంటే మాత్రం పరిస్థితి మొదటికి వస్తుందని.. అప్పుడు చింతించినా ఉపయోగం లేదని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టాడు.
ఎందుకింత వ్యతిరేక కోణం
కూటమి ప్రభుత్వంపై రాధాకృష్ణ వ్యతిరేక కోణాన్ని ప్రదర్శించడం ఇదే కొత్త కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాధాకృష్ణ ఇదే ధోరణి కొనసాగిస్తున్నాడు. ఎమ్మెల్యేలు ఆదిమూలం, మాధవి, ఇంకా కొంతమందిపై రాధాకృష్ణ రాసుకుంటూనే పోతున్నాడు. ఆ మధ్య మంత్రి బాగోతాన్ని కూడా బయటపెట్టాడు. రాధాకృష్ణ రాస్తున్న రాతలు కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిపోయాయి. రాధాకృష్ణ కావాలని ఇలా రాస్తున్నాడా? ప్రభుత్వాన్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడా? అందువల్లే ఇలాంటి రాతలకు ప్రాధాన్యం ఇస్తున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. మరోవైపు రాధాకృష్ణ రాసిన రాతలకు సంబంధించిన కటింగ్స్ ను సోషల్ మీడియాలో వైసిపి విపరీతంగా ప్రచారం చేస్తోంది. టిడిపి మౌత్ పీస్ ఓనర్ ఇలా రాస్తున్నాడు అంటే.. అసలు విషయం ఏమిటో ఆ మాత్రం అర్థం కావడం లేదా అంటూ వైసిపి దెప్పిపొడుస్తోంది. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడం మాత్రం టిడిపి వల్ల కావడం లేదు.