Telangana BJP: బీజేపీ అంటేనే అందరూ క్రమశిక్షణ గల పార్టీ అనుకుంటారు. నాయకులు కూడా సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తారని భావిస్తారు. పదవుల కన్నా.. పార్టీకి ప్రాధాన్యం ఇచ్చే కార్యకర్తలు ఉంటారన్న అభిప్రాయం ఉంది. కానీ కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో వివిధ పార్టీల నాయకులు చేరారు. ఐదేళ్లుగా బీజేపీ బలపడింది. అదే సమయంలో క్రమశిక్షణ కూడా తప్పుతోంది. అంతర్గత కలహాలు పెరుగుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహాల సమావేశంలో అంతర్గత బహిర్గతమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టి, కుల సమీకరణలు, జనాభా మార్పులను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ భావించింది. అయితే, ఈ సమావేశంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా పదేపదే సంబోధించడం ద్వారా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును అవమానించారనే అభిప్రాయం వ్యక్తమైంది.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
రామచందర్‌రావు నియామకమే షాక్?
2025 జూన్ 30న ఎన్. రామచందర్ రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం పార్టీలో అనేక మంది నాయకులకు ఊహించని షాక్‌గా మారింది. ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నేపథ్యం కలిగిన రామచందర్‌రావు, హైదరాబాద్‌లో బలమైన పట్టు కలిగిన నాయకుడిగా, పార్టీలోని వివిధ వర్గాలను ఏకం చేసే సమన్వయకర్తగా ఎంపికైనప్పటికీ, పోటీలో ఉన్న రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి ప్రముఖ నాయకులను పక్కనపెట్టడం వివాదాస్పదమైంది. ఈ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్, నిరసనగా పార్టీ నుంచి రాజీనామా చేసి, రామచందర్ రావు నాయకత్వంపై ‘‘లక్షలాది కార్యకర్తల ఆవేదన’’ను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ అసంతృప్తి జూబ్లీహిల్స్ సమావేశంలో రఘునందన్ రావు చర్యల ద్వారా మరింత స్పష్టమైంది.
పొరపాటా.. ఉద్దేశపూర్వకమా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో రఘునందన్‌రావు, కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరు సార్లు సంబోధించడం పొరపాటున పేర్కొనలేదని తెలుస్తోంది. రామచందర్ రావును ఉద్దేశపూర్వకంగా తగ్గించే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రామచందర్ రావు నియామకానికి ముందు, రఘునందన్ రావు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీదారుగా ఉన్నారు, కానీ ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు లేని నేపథ్యం, ఆయన తండ్రి కాంగ్రెస్ నేపథ్యం వంటి కారణాలతో ఆయన ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో, రఘునందన్ రావు చర్యలు ఆయన అసంతృప్తిని, పార్టీ నాయకత్వంపై విమర్శను సూచిస్తాయని భావిస్తున్నారు.
తాత్కాలిక అధ్యక్షుడిగా కీలక పాత్ర
కిషన్ రెడ్డి, 2023 జులైలో తెలంగాణ బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే, ఆయన నాయకత్వంపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. పార్టీలో సమష్టి నిర్ణయాలు తీసుకోకపోవడం, దిశానిర్దేశం చేయడంలో విఫలమవడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే రఘునందన్ రావు ఆయనను ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా సంబోధించడం, కిషన్ రెడ్డి పార్టీలో ఇప్పటికీ కలిగి ఉన్న ప్రభావాన్ని సూచిస్తుంది. రామచందర్ రావు నియామకంలో కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల మద్దతు కీలకంగా ఉందని సమాచారం.
ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీజేపీకి కీలక పరీక్షగా మారనున్నాయి. నందమూరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలనే ప్రణాళిక, హైదరాబాద్‌లో బీజేపీ స్థానాన్ని బలోపేతం చేయడానికి, కుల సమీకరణలను ఉపయోగించుకోవడానికి ఉద్దేశించినది. అయితే, పార్టీలోని అంతర్గత విభేదాలు, రామచందర్ రావు నాయకత్వంపై అసంతృప్తి ఈ ఎన్నికల్లో పార్టీ పనితీరును దెబ్బతీయవచ్చు. రామచందర్‌రావు ఈ సవాళ్లను అధిగమించి, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురాగలరా అనేది ఆయన నాయకత్వ పరీక్షగా నిలుస్తుంది.