Donkey Milk Business : కోట్లలో గాడిద పాల బిజినెస్.. వాడు మామూలోడు కాదు!

ఏదైనా వ్యాపారం చేయాలంటే తెలివితేటలు ఉండాలి.కానీ మోసం చేస్తామంటే మాత్రం అంతకుమించి ఆకర్షణ ఉండాలి.అందుకే ఆయన ఏకంగా గాడిద పాలతో వ్యాపారం అంటూ నమ్మించాడు. అందర్నీ నట్టేట ముంచాడు.

Written By: Dharma, Updated On : October 29, 2024 4:01 pm

Donkey Milk Business

Follow us on

Donkey Milk Business :  ఇటీవల గాడిద పాలుకు విపరీతమైన గిరాకీ ఏర్పడిన సంగతి తెలిసిందే.గాడిద పాలు తాగడం వల్ల చాలా రకాల రుగ్మతలకు చెక్ చెప్పవచ్చని ప్రచారం సాగింది. ఊరురా తిరుగుతూ చాలామంది గాడిద పాలు విక్రయించేవారు. కొంత సొమ్ము చేసుకునేవారు.చాలామంది గాడిద పాల వ్యాపారం కూడా ప్రారంభించారు. అయితే దీనిని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి గాడిద పాల వ్యాపారంతో కోట్లాది రూపాయలు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పాడు.తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డాడు.గాడిద పాలతో భారీ లాభాలు వస్తాయని,కాస్మోటిక్స్,ఫేస్ క్రీమ్ కోసం వాడతారని చెప్పడంతో నిజమని నమ్మిన చాలా మంది నిండా మునిగిపోయారు.మోసమని తెలియడంతో లబోదిబోమంటున్నారు.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్ లో ఓ వ్యక్తి గాడిదల ఫామ్ ప్రారంభించాడు. అక్కడితో ఆగకుండా తన ఫామ్ దగ్గర యూట్యూబ్ లో వీడియోలు తీస్తూ.. లీటరు గాడిద పాలను 1600 నుంచి 1800 వరకు కొనుగోలు చేస్తానని ప్రచారం మొదలుపెట్టాడు. తనకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని.. కానీ డిమాండ్ కు తగ్గట్టు పాలను సప్లై చేయలేకపోతున్నానని చెప్పాడు. ఎవరైనా గాడిద పాలను తనకు సప్లై చేస్తే తీసుకుంటానని.. నెలకు లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని నమ్మబలికాడు. దీంతో ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చాలామంది ఆశ్రయించడం ప్రారంభించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఆయన చేతిలో చిక్కిపోయారు.

* పక్కా ప్రణాళికతో
అయితే దీనిని ఒక పక్కా వ్యూహంతో వ్యాపారంగా మలుచుకున్నాడు. అందర్నీ నమ్మించేందుకు ఏకంగా డాంకీ సెమినార్స్ నిర్వహించాడు. అక్కడ గాడిదల పెంపకం పైశిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఆయనపై నమ్మకం కుదిరింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువమంది అట్రాక్ట్ అయ్యారు. తన వద్ద మేలు జాతి గాడిదలు ఉన్నాయని చెప్పడంతో ఆయన మాట నమ్మేశారు. గాడిద ధర రూ.90,000 కాగా.. మేలు జాతి గాడిద ధర లక్షన్నర వరకు వసూలు చేసి అందరికీ విక్రయించాడు. గాడిదలనుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని నమ్మబలికాడు. ఈ పాలను నిల్వ ఉంచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు కొనుగోలు చేయాలని వారితో చెప్పాడు. వాటికోసం 75 వేల నుంచి లక్షన్నర వరకు వసూలు చేశాడు. స్థానికంగా తయారు చేయించి అందరికీ పంపించేవాడు.

* ఏపీ వాసులే అధికం
ఏపీలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పదుల సంఖ్యలో ఔత్సాహికులు ఆయన వద్ద గాడిదలను కొనుగోలు చేశారు. వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ప్రారంభంలో పది నుంచి 25 లీటర్ల పాలను కొనుగోలు చేసి లీటరుకు 1600 నుంచి 1800 రూపాయల వరకు చెల్లించేవాడు. దీంతో ఈ గాడిదల వ్యాపారం తెలంగాణ వైపు విస్తరించాడు. ఫ్రాంచైజీలు ఇస్తానంటూ నమ్మబలికి ఐదు లక్షలు చొప్పున వసూలు చేశాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 350 మంది వరకు మోసపోయినట్లు సమాచారం. ఇందులో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి ఆయన అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. దీంతో మోసపోయామని భావిస్తున్న వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఏపీలో ఇప్పటివరకు 46 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.