Tirumala: తిరుమల వెంకన్న సాక్షిగా.. నడకదారిలో నవవరుడిని కబళించిన మృత్యువు

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో విషాదం అలముకుంది. స్వామివారి దర్శనానికి వెళుతున్న నవ వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. మరో జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒకే రోజు రెండు ఘటనలు జరగడంతో విషాదం అలుముకుంది.

Written By: Dharma, Updated On : August 24, 2024 10:28 am

Tirumala

Follow us on

Tirumala : వివాహం జరిగి 15 రోజులు అవుతోంది. తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు ఆ నవ జంట బయలుదేరింది. మెట్ల మార్గంలో వెళ్తుండగా వరుడు గుండె నొప్పితో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించే లోగా మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నవ వధువు బాధ వర్ణనాతీతం. తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి చెందిన నవీన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. 15 రోజుల కిందట ఆయనకు వివాహం జరిగింది. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనానికి బయలుదేరాడు. తిరుపతి నుంచి కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరాడు. నడుచుకుంటూ వెళుతుండగా ఆయాసానికి గురయ్యాడు. 2350 వా మెట్టు దగ్గరకు రాగానే నవీన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. దగ్గర్లో ఉన్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అంబులెన్స్ లో నవీన్ ను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నవీన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

* 15 రోజులు కిందట వివాహం
15 రోజుల కిందట యువతి తో నవీన్ కు వివాహం జరిగింది. పెళ్లిని ఎంతో వేడుకగా చేసుకున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంలో మునిగిపోయారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని భావించారు. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై తిరుమల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* జంట ఆత్మహత్యాయత్నం
తిరుమలకు నడిచి వెళ్లే శ్రీవారి మెట్లు మార్గంలో ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిత్తూరు కొంగారెడ్డిపల్లికి చెందిన వివాహిత, మరో యువకుడితో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. శ్రీవారి మెట్ల మార్గంలో రసాయనాలు తాగి వారిద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇంతలోనే భద్రతా సిబ్బంది స్పందించి వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

* ఒకే రోజు రెండు ఘటనలు
ఒకే రోజు తిరుమల మెట్ల మార్గంలో ఈ రెండు ఘటనలు జరగడం కలకలం సృష్టించింది. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారు మెట్ల మార్గం లో వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. నవీన్ ముందుగా అలసటకు గురయ్యాడు. 2350 మెట్టు చేరుకునేసరికి ఆయాసంతో గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ఎదుట నవవరుడు కుప్ప కూలిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తే ఈ విషాదం ఏంటని కన్నీరు మున్నీరు అవుతున్నారు.