Nara Lokesh: విదేశాలకు లోకేష్.. ఆందోళనలో వైసిపి.. అసలేం జరుగుతోంది?

ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉంది. ఒకవైపు పాలన సాగిస్తూనే గత ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో లోకేష్ రెడ్ బుక్ అమలవుతోందని విపక్ష వైసిపి ఆరోపిస్తోంది.

Written By: Vicky, Updated On : August 24, 2024 10:16 am

Nara Lokesh

Follow us on

Nara lokesh : మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లారా? వెళ్తే అధికారికంగా ప్రకటించలేదు ఎందుకు?ఆయనది రహస్య పర్యటన?లేకుంటే వ్యక్తిగత పర్యటన? అన్నది తెలియడం లేదు.అయితే ఇలా షెడ్యూల్ ప్రకటించకుండా మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లడం ఏంటి అని వైసిపి ప్రశ్నిస్తోంది. స్పెషల్ ఫ్లైట్లో రహస్యంగా ఎందుకు వెళ్లారని వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్విట్ పెట్టింది. అయితే గతంలోనూ వైసీపీ ఇదే తరహా ఆరోపణలు చేసింది. జూలై 28 నుంచి 4వ తేదీ వరకు లోకేష్ ఎక్కడున్నారని ప్రశ్నించింది.విదేశీ పర్యటన వెనుక రహస్య అజెండా ఏంటని నిలదీసింది. నాడు లోకేష్ కోసమే మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఇప్పుడు కూడా లోకేష్ రహస్య పర్యటనపై నిలదీసినంత పని చేస్తోంది.దీంతో సోషల్ మీడియా వేదికగా వైసిపి, టిడిపి మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది.లోకేష్ ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? లేదా? అన్నది వైసిపి అనుమానం.

* టిడిపి స్ట్రాంగ్ రియాక్షన్
అయితే దీనిపై టిడిపి సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. గతంలో లోకేష్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జర్మనీ వెళ్లారు. ఇప్పుడు కూడా పెళ్లి రోజు కావడంతో సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్లారు. ఆయన మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ ను పూర్తి చేశారు. కానీ వైసీపీ మాత్రం జగన్ పై కుట్రలు చేసేందుకే లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లినట్లు అవమానం పడుతోంది.అధికారికంగా ప్రకటించక పోవడానికి తప్పుపడుతోంది.

* వైసీపీలో భయం
అయితే లోకేష్ విషయంలో ఎందుకో వైసీపీ భయపడినట్టు కనిపిస్తోంది. ఆయన రెండు రోజుల పాటు మీడియాలో కనిపించకపోతే ఆందోళన చెందుతోంది. చివరకు లోకేష్ బాత్ రూమ్ కి వెళ్ళినా చెప్పి వెళ్లాలన్నట్టుగా వైసిపి వ్యవహార శైలి ఉంది. వాస్తవానికి లోకేష్ విదేశాలకు వెళ్లినప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకుంటున్నారు. పైగా వ్యక్తిగత పర్యటన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని సైతం వెచ్చించడం లేదు. చివరకు ఇంటి నుంచి ఎయిర్ పోర్టుకు సైతం తన సొంత కారును వినియోగిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం తెగ ఫీల్ అయిపోతోంది. ఈ విషయంలో టిడిపి సైతం ఆగ్రహంగా ఉంది. జగన్ పర్యటనల షెడ్యూల్ ను సాక్షిలో ప్రచురిస్తున్నారా? అని ప్రశ్నిస్తోంది.

* లీక్ చేస్తున్నది ఎవరు
మరోవైపు నారా లోకేష్ వ్యక్తిగత పర్యటన షెడ్యూల్ను ఎవరు లీక్ చేస్తున్నారు అన్నది ప్రశ్నగా మిగులుతోంది. లోకేష్ చుట్టూ ఉన్న భద్రత సిబ్బంది లీక్ చేయవచ్చు. పర్యటన ఏర్పాట్లు చూసి అధికారులు బయటకు చెప్పవచ్చు. అయితే లోకేష్ వద్ద ఏం జరుగుతుందన్నది వైసిపి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే లోకేష్ రెడ్బుక్ పేరిట హడావిడి చేస్తున్నారు. దీంతో లోకేష్ ను ఎవరెవరు కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అన్నది వైసిపి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ కదలికలపై ఇంతగా నిఘా పెట్టాల్సిన అవసరం వైసీపీకి ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. మొత్తానికైతే లోకేష్ విదేశీ పర్యటనపై వైసిపి పెద్ద గలాటా సృష్టిస్తోంది. వివాదాస్పదం చేయాలని ప్రయత్నిస్తోంది.