Hostel Ghost Incident: దెయ్యం.. ఈ మాట వింటేనే ఎంతటి వారైనా భయపడతారు. తమకు భయం లేదని అన్నవారు కూడా కాస్త ఆలోచిస్తారు. అటువంటిది ఓ దయ్యం హాస్టల్లో పడి గాజుల శబ్దంతో భయపెడితే.. నవ్వుతూ విరుచుకు పడితే విద్యార్థులు భయపడి పోరా? కచ్చితంగా భయపడతారు. ప్రతిరోజు ఇదే శబ్దాలు రావడంతో ఆ హాస్టల్లో వసతి పొందుతున్న 600 మంది విద్యార్థులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. చివరకు హాస్టల్ యాజమాన్యం విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. అమరావతి పరిధిలో జరిగింది ఈ ఘటన. అయితే అది మన రాజధాని అమరావతి కాదు. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో..
* తరచూ ఆ శబ్దాలతో..
ఓ ఆశ్రమ పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ క్రమంలో అక్కడ అడ్మిషన్లకు విపరీతమైన గిరాకీ ఉండడంతో చాలామంది విద్యార్థులు చేరుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి కొంతమంది విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందలాదిమంది వెళ్లిపోవడం కనిపించింది. ఇదేమని ఆరా తీస్తే రాత్రిపూట… మహిళల గాజుల శబ్దం వినిపించడం.. పాటలు పాడుతూ రాగాలు తీయడం.. కేకలు వేయడం వంటి శబ్దాలు వినిపిస్తూ వచ్చాయి. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాము హాస్టల్లో ఉండలేమంటూ తల్లిదండ్రులకు తేల్చి చెప్పారు. పిల్లలంతా మూకుమ్మడిగా అదే మాట చెప్పడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వారిని అక్కడ నుంచి తీసుకెళ్లడం ప్రారంభించారు. అయితే ఒకేసారి వందలాదిమంది విద్యార్థులు వెళ్లిపోవడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అక్కడ ఏం జరిగింది అనే దానిపై ఆరా తీయడం ప్రారంభించారు. అయితే కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు బయటకు వచ్చాయి.
* అదో మానసిక భయం..
అక్కడ తీవ్రంగా భయపడుతున్న విద్యార్థులను అధికారులు ఆస్పత్రులకు తరలించి వైద్య పరీక్షలు చేశారు. అయితే అక్కడ విద్యార్థుల్లో తెలియని భయం ఒకటి బయటకు వచ్చింది. మానసిక అనారోగ్యంతో వారంతా బాధపడుతున్నట్లు… సివియర్ హిస్టీరియా లక్షణాలు వారిలో కనిపించినట్లు అక్కడి వైద్యులు గుర్తించారు. ఒకే విషయం పై పదేపదే ఆలోచన చేసినవారికి ఇటువంటి భయం నెలకొంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు అధికారులు. కానీ ఇప్పటికే ఆ భయం అనే స్థితిలో ఉన్న విద్యార్థులు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. అయితే కొందరు అసలు విషయం తెలిసి తమ పిల్లలను తిరిగి హాస్టల్లో చేర్పిస్తున్నారు. వందలాదిమందితో కళకళలాడే హాస్టల్ ఇలా దెయ్యం భయంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.