AP Liquor Policy: ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. నిన్నటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 9 వరకు ఆన్ లైన్ లో కానీ.. ఆఫ్ లైన్ లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం లక్ష వరకు దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ తొలి రోజు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 200 దరఖాస్తులు మాత్రమే రావడం విశేషం. దీంతో అధికారులు సైతం కంగారు పడ్డారు. కానీ అమావాస్య ఎఫెక్ట్ కావడంతోనే ఎక్కువమంది ముందుకు రాలేదని తెలుసుకున్నారు. బుధవారం నుంచి దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దరఖాస్తు రూపంలో రెండు లక్షల రెఫండబుల్ నగదు చెల్లించాల్సి ఉంది. దరఖాస్తు రుసుము రూపంలోనే దాదాపు 2000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో వారం రోజులు పాటు అవకాశం ఉండడంతో లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
* ఆ వెసులుబాటుతో
ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైన వేసుకోవచ్చు అన్న వెసులబాటు నేపథ్యంలో.. భారీగా దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి సైతం అనుమతి ఇవ్వడంతో.. దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2017లో టిడిపి ప్రభుత్వ హయాంలో లైసెన్సులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో దుకాణానికి సగటున 18 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 78 వేల దరఖాస్తులు అందాయి. ఈసారి 3396 దుకాణాలకు గాను.. ఒక్కో దానికి సగటున 30 వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 9 వరకు గడువు ఉండగా.. చివరి మూడు రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశం ఉంది.
* అత్యధికంగా విశాఖలో
రాష్ట్రంలో విశాఖ కార్పొరేషన్ పరిధిలో 136 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ మొత్తం విశాఖ నగరంలోనే ఎక్కువ షాపులు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తిరుపతిలో 227, అచ్చల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 40 దుకాణాలను నోటిఫై చేశారు. మొత్తం 3396 దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అందులో దాదాపు 67% మండలాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేషన్ల పరిధిలో 511, మున్సిపాలిటీల పరిధిలో 499, నగర పంచాయతీల పరిధిలో 125 చొప్పున షాపులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే తొలి రోజు దరఖాస్తులు పెద్దగా రాకపోవడంతో అధికారులు నిరాశ చెందారు. కానీ ఈరోజు నుంచి దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. చివరి మూడు రోజులుభారీగా దరఖాస్తులు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.