TTD Laddu Issue: లడ్డూ వివాదంలో బిజెపి ఎటువైపు.. రేపు స్పష్టం చేయాల్సిందే!

కేంద్ర పెద్దలు డిఫెన్స్ లో పడ్డారు. లడ్డు వివాదంలో తలదూర్చేందుకు భయపడుతున్నారు. ఒకవైపు భాగస్వామ్య టిడిపి ప్రభుత్వం. ఇంకోవైపు వైసీపీ వాదనలు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రానికి ఎదురైంది.

Written By: Dharma, Updated On : October 2, 2024 10:10 am

TTD  Laddu issue

Follow us on

TTD Laddu Issue: తిరుమలలో వ్యవహారంలో బిజెపి పెద్దల మౌనం ఎందుకు? చంద్రబాబు ఆరోపణలను వారు నమ్మలేదా? లేకుంటే జగన్ లేఖ కారణమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బిజెపి నేతల్లో ఒక వర్గం మాత్రమే స్పందించింది. ఇంకో వైపు కేంద్రంలో కీలక వ్యక్తులు ఎవరు దీనిపై మాట్లాడలేదు. ఒకరిద్దరు సహాయ మంత్రులు తప్పించి బిజెపికి చెందిన క్యాబినెట్ మంత్రులు స్పందించిన దాఖలాలు లేవు. ఈ విషయం బయటపడిన వెంటనే సీఎం చంద్రబాబుతో బిజెపి జాతీయాధ్యక్షుడు నడ్డా ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే లడ్డు వివాదం బయటకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత సీరియస్ ఇష్యూ అవుతుందని అంతా భావించారు. కానీ ప్రధాని తిరిగి దేశానికి రావడం.. హర్యానా ఎన్నికల్లో తలమునకలు కావడం జరిగిపోయాయి. కనీసం ఆరా తీసిన సందర్భం కూడా బయట పడలేదు. ఇంతలో సుప్రీంకోర్టు ఈ ఇష్యూ పై మాట్లాడింది. చంద్రబాబు వ్యవహరించిన తీరును తప్పు పట్టింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ తరహా వ్యాఖ్యలు చేయడం, కేంద్ర పెద్దలు పట్టించుకోకపోవడంతో ఈ అంశంపై అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.

* సిట్ విచారణ చెల్లుతుందా?
సుప్రీంకోర్టు తాజా విచారణలో కేంద్రం కలుగు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఆరోపణలు చేసిన చంద్రబాబు ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం అది. అందుకే సిట్ దర్యాప్తు అవసరం లేదని.. తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం సిట్ దర్యాప్తు విషయంలో నివేదిక ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ నివేదిక కీలకం కానుంది. అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి రేపు తెలియని ఉందన్నమాట.

* సిబిఐతో దర్యాప్తునకు డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సిట్ విచారణ జరిగితే వాస్తవాలు బయటకు రావు అని పిటిషనర్లు వాదిస్తున్నారు. లడ్డులో వాడిన నెయ్యి కల్తీ అని తేల్చేస్తూ చంద్రబాబు ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. దానిని దాటుకుని సిట్ ఏ విధంగా వేరే రకమైన నివేదిక ఇస్తుందన్నది ఇప్పుడు అనుమానం. అందుకే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మదిలో ఏముంది అన్నది ఇప్పుడు అనుమానం. ఒకవేళ సొలిసిటర్ జనరల్ సిబిఐ దర్యాప్తునకు నివేదిస్తే కేంద్రం ఈ విషయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టే. లేదు లేదు సిట్ దర్యాప్తు కొనసాగాలని సూచిస్తే మాత్రం చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి కోటమిది పైచేయిగా నిలిచే అవకాశం ఉంది.

* జాగ్రత్త పడిన బిజెపి
లడ్డు వివాదం నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని కేంద్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కాపాడాల్సిన అవసరం కేంద్రంపై ఉంది. ఈ విషయంలో ఎటువంటి పొరపాట్లు జరిగిన భవిష్యత్తులో బిజెపి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ పార్టీ నేతలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వీలైనంతవరకు ఈ వివాదంలో తల దూర్చకూడదని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సొలిసిటర్ జనరల్ రూపంలో కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి ఏం చెబుతుందన్నది ప్రశ్నగా మిగిలింది. చూడాలి మరి రేపు ఏం జరుగుతుందో?