Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యూహ ప్రతివ్యూహాలు జోరందుకుంటున్నాయి. ‘విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలి’ అని మమతా బెనర్జీ భావిస్తుండగా… ‘మా అభ్యర్థి గెలుపు ఖాయం. కానీ… ఘన విజయం సాధించడమే మా లక్ష్యం’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే విపక్ష కూటమి అభ్యర్థి ఇంతవరకూ ఖరారు కాకపోవడం ప్రతికూలాంశంగా మారింది. విపక్ష కూటమి అభ్యర్థిగా పోటీచేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదు. రకరకాల కారణాలు చూపి సీనియర్ నేతలు తప్పించుకుంటున్నారు. తాజాగా రాష్ట్రపతి పదవికి పోటీపడేందుకు బెంగాల్ మాజీ గవర్నర్, మహత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా నిరాకరించారు. ప్రతిపక్షాల తరఫున బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించారు. మంగళవారం ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమవనున్న తరుణంలో ఆయన విపక్షాల అభ్యర్థనను తిరస్కరించడం గమనార్హం. విపక్షాల తరఫున పోటీ చేసేందుకు తొలుత శరద్ పవార్, తర్వాత ఫరూక్ అబ్దుల్లాలు నిరాకరించగా.. తాజాగా గోపాలకృష్ణ గాంధీ కూడా నో చెప్పారు.
తెరపైకి బెంగాల్ నేత
దీంతో మరోసారి రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల వేట ప్రారంభమైంది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాతో ప్రతిపక్ష నేతలు చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీని పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శించిన యశ్వంత్.. తృణమూల్ కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. విపక్ష నేతలంతా అంగీకరిస్తే మంగళవారం యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి. కాగా ప్రతిపక్షాల ఐక్యతను, జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిర్ణయించాలని గోపాలకృష్ణ గాంధీ అన్నారు. తనను రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని అడిగినందుకు విపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: MLA Karanam Dharmasri: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ పోస్టు.. ప్రజాసేవకే మొగ్గు
జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించగలిగిన నాయకుల్లో తనకంటే మెరుగైన వారు ఉన్నారని భావిస్తున్నానని, అలాంటి వారికి అవకాశం ఇవ్వమని కోరినట్లు వివరించారు. చివరి గవర్నర్ జనరల్‌గా ఉన్న రాజాజీ, దేశ తొలి రాష్ట్రపతిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ లాంటి ఉన్నత వ్యక్తులు రాష్ట్రపతి పదవిలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ఇక మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మంగళవారం నాటి భేటీకి తాను హాజరవుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వెల్లడించారు. బెంగాల్ సీఎం మమతకు ఇతర అపాయింట్మెంట్లు ఉన్నందున ఆమె హాజరవ్వకపోవచ్చని.. టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
‘మహా’ సంక్షోభం..
ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమవనున్న తరుణంలో మహారాష్ట్రలో మహా కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగురవేశారు.వారు ఏకంగా బీజేపీ పాలిత గుజరాత్ కు మకాం మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లో క్యాంప్ వేసిన మంత్రి ఏక్నాథ్ షిండే.. బీజేపీ-శివసేన జట్టు కట్టాలనే డిమాండ్ చేయబోతున్నారని, ఈ మేరకు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేయవచ్చునని పలు రిపోర్టులు వెలువడుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో వేచిచూడాలి. మరోవైపు కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లారు. ఈ పరిణామం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా మహారాష్ట్ర విపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ బయలుదేరారు. అమిత్ షా, నడ్డాలతో ఆయన భేటీ కానున్నారని సమాచారం. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాగా మహాకూటమి పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. అయితే రెబల్స్ ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్టు రిపోర్టులు వెలువడుతుండడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమవ్వాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ మధ్యహ్నాం భేటీ జరిగే అవకాశాలున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఉన్న శరద్ పవర్ కు ఇలా కొత్త చిక్కొచ్చిపడింది. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.
Also Read: Political Crisis in Maharashtra: మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను కూల్చే పనిలో బీజేపీ
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Yashwant sinha name proposed as opposition candidate for president gopalakrishna gandhi who said no
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com