CM Revanth Reddy : సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి అనేక విషయాల గురించి మాట్లాడారు. హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రాల షూటింగ్ కు గమ్యస్థానం చేయాలని.. అందుకు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా సహకరించాలని రేవంత్ కోరారు. ” గతంలో హైదరాబాద్లో చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ఈసారి ఇంటర్నేషనల్ ఫీలిం ఫెస్టివల్ జరిగేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. దానికి పరిశ్రమ కూడా సహకరించాలి. ప్రభుత్వపరంగా రాయితీలు అందిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుదల ఉండదు. ఇదే విషయాన్ని నేను శాసనసభ వేదికగా చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. తెలుగు మాత్రమే కాదు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్ పూరి, మరాఠీ చిత్రాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఈ విస్తృతి ఇంకా పెరగాలి. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాదులోనే షూటింగ్ జరుపుకోవాలి. అందుకు అనువైన పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తుందని” రేవంత్ సినీ ప్రముఖులతో వ్యాఖ్యానించారు.
పేరు మర్చిపోవడంపై..
ఇటీవల విడుదలైన పుష్ప -2 సినిమాకు ప్రభుత్వం బెనిఫిట్ షోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. అయితే పుష్ప సినిమా టికెట్ రేట్ల విషయంలో విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. రేవతి చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక్కసారి గా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల ధర పెంపు ఉండదని పేర్కొంది. అయితే పుష్ప -2 సినిమా విజయవంతమైన తర్వాత నిర్వహించిన సక్సెస్ మీట్ లో చిత్ర హీరో అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. అందువల్లే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై కక్ష కట్టారని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపించారు. అందువల్లే అల్లు అర్జున్ పై కేసులు పెట్టారని మండిపడ్డారు. అయితే ఇదే విషయం గురువారం నాటి సీఎం, సినీ ప్రముఖుల భేటీలో చర్చకు వచ్చిందని తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారని.. అల్లు అర్జున్ పై తనకు వ్యక్తిగతంగా కక్ష లేదని.. చట్టపరంగా తాము చేయాల్సిన పని చేస్తామని.. పేరు మర్చి పోయినంతమాత్రాన తాను వ్యక్తిగతంగా తీసుకునే వ్యక్తిని కాదని రేవంత్ స్పష్టం చేశారని సమాచారం. ప్రభుత్వం సహకరించినప్పటికీ.. ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడాన్ని ఎలా చూస్తారో సినీ ప్రముఖులకే తెలియాలని.. ఆ వ్యవహారాన్ని వాళ్లే మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది.