Joe Biden: అమెరికా తప్పుకుంటే.. అధ్యక్షత వహించేదెవరు?

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపునే కోరుకుంటున్నాయని బైడెన్‌ అన్నారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి ‘మీరే గెలవాలి’ అని తమ అభిప్రాయాన్ని చెప్పారన్నారు.

Written By: Raj Shekar, Updated On : April 24, 2024 12:37 pm

Joe Biden

Follow us on

Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరన జరుగనున్నాయి. ఇప్పటికే బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. దీంతో అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు అయిన జోబైడెన్‌తోపాటు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం ముమ్మరం చేశారు. మరోమారు అధికారంలోకి వచ్చేందుకు డెమొక్రటిక్‌ పార్టీ ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా అధ్యక్ష స్థానం దక్కించుకోవాలని రిపబ్లికన్‌ పార్టీ ప్రచారం జోరుగా చేస్తోంది. ఫ్లోరిడాలో జో బైడెన్‌ మంగళవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ అమెరికా ప్రపంచ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పికోవాలని వాదిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు.

తన గెలుపును కోరుకుంటున్నారు..
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపునే కోరుకుంటున్నాయని బైడెన్‌ అన్నారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి ‘మీరే గెలవాలి’ అని తమ అభిప్రాయాన్ని చెప్పారన్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచం అమెరికావైపే చూస్తోందన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కన్నా.. ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయనేది అందరినీ ఆకర్షిస్తోందని తెలిపారు.

500 మిలియన్‌ డాలర్ల విరాళాలు..
తన ప్రచారం అద్భుతంగా ముందుకళ్తోందని బైడెన్‌ తెలిపారు ఇప్పటి వరకు తమకు 500 మిలియన్‌ డాలర్లకుపైగా విరాళాలు వచ్చాయని తెలిపారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని వెల్లడించారు. వీరిలో 97 శాతం మంది 200 డాలర్లకు దిగువనే ఇచ్చారని పేర్కొన్నారు.

సర్వేలు అనుకూలం..
ఇక బైడెన్‌ సర్వేల అంశాన్ని కూడా ప్రచారంలో ప్రస్తావించారు. అనేక సర్వేల్లో ట్రంప్‌ కన్నా తానే ముందు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు వెలువడిన 23 జాతీయ పోల్స్‌లో పదింటిలో తానే ముందు ఉన్నట్లు తెలిపారు. ట్రంప్‌ ఎనిమిదింటిలో ఆధిక్యంలో ఉన్నారన్నారు. ఐదింటిలో టై అయిందని చెప్పారు. కచ్చితంగా పరిస్థితులు తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మార్కెట్‌ పోల్‌లో 8 పాయింట్లు ఎగబాకామని తెలిపారు. మార్టిస్ట్‌ పోల్‌లో మూడు పాయింట్లు పెరిగామని బైడెన్‌ పేర్కొన్నారు.