International Girl Child day 2024: ప్రపంచవ్యాప్తంగా బాలికలంటే అందరికీ చిన్న చూపే. తల్లి కడుపు నుంచి బయటకు రాకుండానే అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే వద్దని చెప్పేవారు చాలామందే ఉన్నారు. పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల పుట్టిందని, భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఉన్నారు. పెరుగుతున్న సమయంలో కూడా ఆడపిల్లలు ఎన్నో సమస్యలను అధిగమిస్తారు. ఇంట్లో నుంచి లింగ బేధం ప్రారంభమై.. ఎక్కడికి వెళ్లిన అమ్మాయివి అనే తేడా ఉంటుంది. ఇలా చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. అయితే బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను అరికట్టడంతో పాటు వారి గురించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటారు. బాలికల సాధికారతను ప్రోత్సహించడానికి, వీరి గురించి సమాజంలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ ఏడాది థీమ్ ఏంటంటే?
ప్రతీ ఏడాది అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ ఏడాది గర్ల్స్ విజన్ ఫర్ ది ఫ్యూచర్ అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం థీమ్ బాలికలకు ఎలాంటి సమస్యలు వచ్చిన తక్షణమే చర్యలు తీసుకోవాలనే, బాలికలు కూడా వారి స్వరాలను వినిపించాలనే ఉద్దేశంతో ఈ థీమ్‌ను పెట్టారు. చాలా మంది బాలికలు భయపడి ఇబ్బందులు వచ్చిన కూడా ఆగిపోతున్నారు. అలా భయపడకుండా ధైర్యంతో ఉండాలని, వారి భవిష్యత్తును కాపాడుకోవాలనే ఈ థీమ్ చెబుతోంది. లింగ అసమానతలు, బాల్య వివాహాలు, బాలికల ఆరోగ్య సంరక్షణ, విద్య అన్ని రంగాల్లో బాలికలకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు. బాలికలు వారి హక్కులు, అందరితో సమాన అవకాశాలు ఉన్నాయని తెలిసేలా చేయాలి. నేటి తరంలో బాలికలు ఎక్కువగా పేదరికం, మానవ హక్కులు, లింగ సమానత్వం వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు.
దీని చరిత్ర ఏంటి?
ప్రపంచ వ్యాప్తంగా బాలికలు వారి హక్కులు తెలియకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి హక్కులు తెలిసేలా చేయడంతో పాటు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉండేలా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవాలని.. 1995లో బీజింగ్‌లో ప్రస్తావించారు. బాలికలు వారి హక్కులను తెలియజేయాలని ప్రస్తావన రావడంతో ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ 11న బాలికల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2011 డిసెంబర్ 19న తీర్మానించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో దాదాపు ప్రతి ఐదుగురిలో ఒక బాలిక లోయర్ సెకండరీ స్కూల్ కూడా పూర్తి చేయడం లేదని ఐక్యరాజ్య సమితి తెలిపింది. పది మందిలో దాదాపు నలుగురు బాలికలు ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేయడం లేదు. కొన్ని దేశాల్లో బాలికలకు, యువతులకు ఇంటర్నెట్ యాక్సెస్ కూడా లేదని తెలిపింది.