Jagan: జగన్ గుడ్ బుక్.. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు అంటున్న వైసీపీ శ్రేణులు!

2019 ఎన్నికల్లో ఎన్నో ఆశలతో వైసిపి శ్రేణులు కష్టపడి పనిచేశాయి. ముఖ్యమంత్రి పీఠంపై జగన్ ను కూర్చోబెట్టాయి.కానీ జగన్ మాత్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.కనీసం వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు.ఇప్పుడు గుడ్ బుక్ అంటూ కొత్తగా ప్రకటనలు చేస్తున్నారు.దీనిపై పార్టీ శ్రేణుల నుంచి భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : October 11, 2024 3:06 pm

YS Jaganmohan Reddy

Follow us on

Jagan: తాను కూడా ఒక బుక్ రాసుకుంటానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ మాదిరి కాదని.. గుడ్ బుక్ అంటూ చెప్పుకొచ్చారు జగన్. అందులో రాజకీయ ప్రత్యర్థులకు స్థానం లేదని.. కేవలం వైసీపీ నేతల పేర్లు అందులో రాసుకుంటానని జగన్ చెప్పడం విశేషం. దానికి గుడ్ బుక్ గా కూడా నామకరణం చేశారు.అయితే అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ గుడ్ బుక్ అమలు చేస్తారా? లేదా? అన్నది వైసిపి శ్రేణుల అనుమానం. జగన్ సీఎం కావాలని వైసిపి శ్రేణులు పెద్ద ఉద్యమమే చేశారు.అంతకుమించి యుద్ధం చేశారు.ముఖ్యమంత్రిగా జగన్ ను చూసుకోవాలని పరితపించారు.ఈ క్రమంలో చాలా విధాలుగా నష్టపోయారు.జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని వారు భావించారు.అయితే కష్టాలు తీరకపోగా.. తమ కష్టానికి ప్రతిఫలం వేరే వారు దక్కించుకున్నారు. దీంతో వారు పడిన బాధ అంతా ఇంతా కాదు. దాని ఫలితమే మొన్నటి పార్టీ ఓటమి. పార్టీ తమను పట్టించుకోకపోతే.. తాము ఎందుకు పార్టీ కోసం కష్టపడాలని వారు నిట్టూర్చారు. నిరాశకు గురయ్యారు. భౌతికంగా పార్టీలో ఉన్నా.. పార్టీ విజయం కోసం పెద్దగా పరితపించలేదు. బహుశా ఇప్పుడు దానినే గుర్తించి జగన్ గుడ్ బుక్ అంశాన్ని బయటపెట్టారు. తద్వారా వైసిపి శ్రేణులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశారు.

* లక్షలాదిమంది సైనికులుగా
కాంగ్రెస్ పార్టీ నుంచి తనతో పాటు తన తల్లి మాత్రమే వచ్చారని.. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజాబలం తనకు సమకూరిందని జగన్ చెప్పుకొస్తున్నారు. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి లక్షలాదిమంది సుశిక్షితులైన సైనికుల మాదిరిగా పనిచేశారు.2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. వారు వెనక్కి తగ్గలేదు. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనా.. జగన్ ను విడిచిపెట్టి వెళ్లలేదు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను సీఎం చేయాలని అహోరాత్రులు శ్రమించారు.ఇంటి వ్యక్తిగా భావించి ఆయన కోసం గట్టిగానే పోరాటం చేశారు.

* వాలంటీర్లకు అందలం
అయితే గత ఐదేళ్లలో టిడిపి ప్రభుత్వానికి మించి.. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ కోసం అన్నీ చేసిన శ్రేణులను కాదని.. వాలంటీర్లకు అందలం ఎక్కించారు జగన్. రాష్ట్రస్థాయిలో ఆ నలుగురికి పెద్దపీట వేసి.. కిందిస్థాయిలో కొట్టుకు చావండి అన్నట్టు వదిలేశారు. సాధారణ లబ్ధిదారులతో మాదిరిగానే వైసీపీ శ్రేణులను లెక్క కట్టారు. వారు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. వారికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడు జగన్ గుడ్బుక్ అంటూ చెప్పుకొస్తున్నా పెద్దగా రెస్పాన్స్ లేదు.న్యాయం చేయాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేశారు.ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఊరడింపుకు దిగుతున్నారు.అధినేత మాటలను ఇప్పుడు వైసీపీ శ్రేణులు సైతం లైట్ తీసుకుంటున్నాయి.