Bangladesh: బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో.. నెలకొన్న అల్లర్ల వల్ల తన ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె ఆర్మీ హెలికాప్టర్లో భారత్ చేరుకున్నారు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనను తాను రాజకీయ శరణార్థిగా ఆమె ప్రకటించుకున్నారు. అయితే ఇంగ్లాండ్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ప్రస్తుతం ఆమె భారత్ లోనే తల దాచుకుంటున్నారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆ దేశంలో అల్లర్లు తగ్గుముఖం పట్టలేదు. పైగా ఆ దేశానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
ప్రధానమంత్రి పదవికి రాజీనామా తర్వాత షేక్ హసీనా తొలిసారిగా నోరు విప్పారు. ఒక ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ” నా దేశంలో నేను శవాల వేడుకను చూడాలని అనుకోలేదు. విద్యార్థుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి కొంతమంది అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు. దానికి నేను ఏమాత్రం అంగీకరించలేదు. అలాంటివి తట్టుకోలేక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాను. ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపంలో అధికారాన్ని గనక అప్పగించి.. అమెరికాకు బంగాళాఖాతంలో స్థానం ఇస్తే.. కచ్చితంగా ప్రధానమంత్రి పదవిలో ఉండేదాన్ని. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నేను ధైర్యంగానే ఉన్నాను. బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం పని చేశాను. ఇప్పటికైనా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అతివాదుల మాయలో పడకండి” అని షేక్ హసీనా ప్రకటించారు.
బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లర్ల వల్ల చాలామంది నాయకులు చనిపోయారు.. అవామీ లీగ్ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఆందోళనకారులు ధ్వంసం చేయడం వల్ల బంగ్లాదేశ్ ఓ సంక్షుబిత దేశంగా మారిపోయింది. అయితే త్వరలోనే షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ప్రచారం జరుగుతోంది. దేవిశాన్ని ఆమె ఓ ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. అవామీ లీగ్ ధైర్యంగా నిలబడుతుందని ఆమె వెల్లడించారు. బంగ్లాదేశ్ సంక్షేమం కోసం తాను భగవంతుడికి ప్రార్ధనలు చేస్తున్నానని షేక్ హసీనా ఆ సందేశంలో వెల్లడించారు.
ఆగస్టు ఐదు నుంచి బంగ్లాదేశ్లో అల్లర్లు తారాస్థాయిలో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గత వారమే రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారత్ లో ఉంటున్నారు. ఇంగ్లాండ్ లో ఆశ్రయం పొందడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు గత ఏడాది మే నెలలో కూడా హసీనా సంచలన ప్రకటన చేశారు. “మనదేశంలో ఎన్నికలు సాఫీగా జరగాలంటే ఒక దేశానికి బంగాళాఖాతంలో స్థావరం కల్పించాలి. కానీ అది అంత సులభంగా జరగదని” హసీనా పేర్కొన్నారు. అప్పట్లో హసీనా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. సరిగా ఏడాది గడవగానే నాడు ఆమె అన్న మాటలు నేడు పునరావృతమయ్యాయి. ఆమె తన పదవిని కూడా కోల్పోయారు.