Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, ఈ రోజును ’లిబరేషన్ డే’గా అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని, ఇతర దేశాలు విధించే సుంకాలకు సగం మాత్రమే తాము వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సుంకాలను ’రాయితీ టారిఫ్‌లు’గా పేర్కొన్న ట్రంప్, ఇది జాలితో కూడిన చర్య అని వ్యాఖ్యానించారు.
Also Read : ట్రంప్ టారిఫ్ బాంబు: భారత్‌పై 26% సుంకాలు.. ఆ రెండు దేశలకు మినహాయింపు!
అమెరికాకు పునర్జన్మ దినం
ట్రంప్ మాట్లాడుతూ, ‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. అమెరికా పరిశ్రమలు ఈ రోజు పునర్జన్మించాయి. ఈ రోజు అమెరికా సుసంపన్న దేశంగా మళ్లీ అవతరించింది. గత 50 ఏళ్లుగా ఇతర దేశాలు అమెరికా పన్ను చెల్లింపుదారులను దోపిడీ చేశాయి. ఇక అలా జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పనిసరిగా ప్రతీకార సుంకాలు విధిస్తాం. ఈ రోజు అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం సిద్ధించింది,‘ అని అన్నారు. ఈ సుంకాలతో అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయని, కంపెనీలు తిరిగి వస్తాయని, విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో అమెరికాలో పోటీతత్వం పెరిగి, సరసమైన ధరల్లో వస్తువులు అందుబాటులోకి వస్తాయని, ఇది అమెరికా స్వర్ణయుగానికి దారితీస్తుందని చెప్పారు.
వాణిజ్య అసమతుల్యతపై విమర్శలు
ట్రంప్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా అమెరికా వాణిజ్య అడ్డంకులను తొలగిస్తూ వచ్చినప్పటికీ, ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్నాయని ఆరోపించారు. ఉదాహరణకు, అమెరికాలో దిగుమతి అయ్యే మోటార్‌సైకిళ్లపై కేవలం 2.4 శాతం సుంకాలు ఉండగా, థాయ్‌లాండ్ 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే విధంగా, దక్షిణ కొరియా, జపాన్‌లలో స్థానికంగా తయారైన కార్లు అక్కడే ఎక్కువగా అమ్ముడవుతుండగా, అమెరికా కార్లు ఇతర దేశాల్లో తక్కువగా అమ్ముడవుతున్నాయని విమర్శించారు. ఈ అసమతుల్యతను సరిచేయడానికే విదేశీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు.
ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల జాబితా ఇదీ:
భారత్: 26 శాతం
చైనా: 34 శాతం
ఈయూ: 20 శాతం
తైవాన్: 32 శాతం
జపాన్: 24 శాతం
దక్షిణ కొరియా: 25 శాతం
థాయ్‌లాండ్: 36 శాతం
స్విట్జర్లాండ్: 31 శాతం
ఇండోనేషియా: 32 శాతం
మలేషియా: 24 శాతం
కంబోడియా: 49 శాతం
యూకే: 10 శాతం
దక్షిణాఫ్రికా: 30 శాతం
బ్రెజిల్: 10 శాతం
బంగ్లాదేశ్: 37 శాతం
సింగపూర్: 10 శాతం
ఇజ్రాయెల్: 17 శాతం
ఫిలిప్పీన్స్: 17 శాతం
చిలీ: 10 శాతం
ఆస్ట్రేలియా: 10 శాతం
పాకిస్థాన్: 29 శాతం
టర్కీ: 10 శాతం
శ్రీలంక: 44 శాతం
కొలంబియా: 10 శాతం