Donald Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నంత పని చేశాడు. భారత్ తన మిత్రదేశమే.. మోదీ నాకు మంచి మిత్రుడు అంటూనే.. ప్రతికార సుంకాలు విధించారు. ‘లిబరేషన్ డే‘(Libaration) పేరుతో పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రకటించారు. ట్రంప్ తన ప్రసంగంలో ‘మోదీ(Modi) నాకు గొప్ప స్నేహితుడు..కానీ భారత్(India) మమల్ని సరిగా చూసుకోవడం లేదు. అమెరికా ఉత్పత్తులపై 52 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. అందుకే మేము దానిలో సగం, అంటే 26 శాతం, పరస్పర సుంకాలుగా విధిస్తున్నాం’ అని తెలిపారు. ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 9, 2025 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది, దీనితో భారత వాణిజ్యంపై ప్రభావం పడవచ్చు.
Also Read : ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమలు కాకముందే భారత ఆటో రంగంపై తీవ్ర ప్రభావం!
మా సుంకాలు తక్కువే..
ట్రంప్ మాట్లాడుతూ, ఇతర దేశాలు అమెరికాపై విధించే సుంకాలతో పోలిస్తే తాము తక్కువ స్థాయిలోనే వసూలు చేస్తున్నామని, ఇది దేశాల మధ్య సమతుల వాణిజ్యాన్ని ప్రోత్సహించే చర్య అని వివరించారు. అదే సమయంలో, చైనా(China)పై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు కూడా ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు వసూలు చేయనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఆ రెండు దేశాలకు మినహాయింపు..
అయితే, ఆసక్తికరంగా రష్యా, ఉత్తర కొరియాలకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2ని అమెరికా ’విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్, బుధవారం వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ రోజ్ గార్డెన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. అమెరికా వ్యాపారం ఈ రోజు పునర్జన్మించింది. సుంకాల పేరుతో అమెరికాను దోపిడీ చేసిన రోజులు ముగిశాయి. మాపై సుంకాలు విధించే దేశాలకు తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ రోజు అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం సిద్ధించిన రోజు,‘ అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా స్వర్ణయుగం దిశగా
ట్రంప్ మాట్లాడుతూ, ‘ఈ సుంకాలతో అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి, కంపెనీలు తిరిగి వస్తాయి, విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి. అమెరికాలో పోటీతత్వం పెరిగి, సరసమైన ధరల్లో వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఇది అమెరికా స్వర్ణయుగానికి నాంది అవుతుంది,‘ అని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అమెరికా వాణిజ్య అడ్డంకులను తొలగిస్తూ వచ్చినప్పటికీ, ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్నాయని ఆయన విమర్శించారు.