Homeఅంతర్జాతీయంTrump Shooting Attempt: సినిమాల్లో చూపించినంత సీన్ ఉండదా.. అమెరికాలో సెక్యూరిటీ నేతి బీరేనా?

Trump Shooting Attempt: సినిమాల్లో చూపించినంత సీన్ ఉండదా.. అమెరికాలో సెక్యూరిటీ నేతి బీరేనా?

Trump Shooting Attempt: పోలీసింగ్ వ్యవస్థ గురించి ప్రస్తావనకు వస్తే.. అమెరికానే మదిలో మెదులుతుంది. అమెరికాలో సెక్యూరిటీ గురించి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అనేక సినిమాల్లో కథలు కథలుగా దర్శకులు చూపించారు. నిజంగానే అమెరికాలో భద్రత ఆ స్థాయిలో ఉంటుందా అనుకునేలా చేశారు. కానీ అమెరికాలో కూడా భద్రత అనేది నేతి బీర అని, అక్కడి పోలీసులలో తారాస్థాయిలో నిర్లక్ష్యం పేరుకుపోయిందని.. ట్రంప్ పై కాల్పుల ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. ట్రంప్ పై కాల్పులు జరిగిన తర్వాత ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్టు ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా భద్రతా దళాల వ్యవహార శైలిని పూర్తిగా తప్పు పట్టింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అక్కడివారు పోలీసులకు సమాచారం అందించారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదట. “ఆ వ్యక్తి మాకు అనుమానాస్పదంగా కనిపించాడు. సమీపంలో ఉన్న భవనాన్ని ఎలుగుబంటిలాగా పాకాడు. మాకు 50 అడుగుల దూరంలో ఉన్న భవనం పై కప్పుకి వెళ్ళాడు. అంతా మేము గమనించాం. ఇదే విషయాన్ని భద్రతా దళాలకు విన్నవించాం. అయినప్పటికీ వారు పట్టించుకోలేదని” ఓ వ్యక్తి అక్కడి స్థానిక మీడియాతో వాపోయాడు. “భద్రతను పర్యవేక్షించే అధికారులకు మొత్తం వివరించాం. అయితే అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. వారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదని” ఓ ప్రత్యక్ష సాక్షి అంతర్జాతీయ మీడియా సంస్థతో వివరించాడు. “ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఓ వ్యక్తి ఐదు షాట్లు తుపాకీతో కాల్చాడు. అప్పటికి రెండు మూడు నిమిషాల పాటు నేను అతడిని చూస్తూనే ఉన్నాను. సీక్రెట్ సర్వీస్ అధికారులు మమ్మల్ని చూస్తున్నారు. నేను ఆ పైకప్పు వైపు వేళ్ళను చూపిస్తూ వారికి ఆధారాలు ఇస్తున్నాను. అయినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. వారికి తెలిసిందల్లా కేవలం 5 షాట్ల ఫైరింగ్ మాత్రమే. ఏదో అలా వేదికపైకి వెళ్ళిపోయారు గాని.. ఏం జరుగుతుందో వారికి అర్థం కావడం లేదని” మరో వ్యక్తి బీబీసీ ఛానల్ విలేకరితో వాపోయాడు.

మరోవైపు ట్రంప్ పై కాల్పులు జరిగిన అనంతరం సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలను నెటిజన్లు చేస్తున్నారు. “అమెరికాలో ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లు సరిగ్గా లేవు. సెక్యూరిటీ సర్వీస్ ఎందుకు సమర్థవంతంగా పనిచేయలేదు. ఇలా అయితే ఎలా?” అంటూ ఓ వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మరోవైపు ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడు ఈవెంట్స్ గ్రౌండ్స్ వెలుపల ఉన్నాడని స్థానికంగా ఉండే ఓ న్యాయవాది చెప్పిన మాటలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో భద్రత డొల్ల అని నిరూపిస్తున్నాయి.”నిందితుడు ఆ ప్రదేశానికి ఎలా చేరుకున్నాడు నాకు తెలియదు. కానీ అతడు మైదానం వెలుపల ఉన్నాడు. అతడు అక్కడికి ఎలా వచ్చాడో గుర్తించాల్సిన అవసరం ఉందని” బట్లర్ కౌంటింగ్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి రిచర్డ్ గోల్డింగర్ పేర్కొన్నాడు..

మరోవైపు ట్రంప్ పై కాల్పులు జరిగిన అనంతరం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల నుంచి కీలక ప్రకటన వెలువడింది.. “ఈరోజు తెల్లవారుజామున పెన్సిల్వేనియాలోని బట్లర్ లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగాయి. దానికి సంబంధించిన కేసుపై దర్యాప్తులో లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ పాత్రను స్వీకరించిందని” ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రకటించారు..”ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభమైంది. ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. మా వంతుగా అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కీలక ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని” ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వివరించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular