Donald Trump Pakistan Politics: అడుగులకు మడుగులొత్తినా.. మాటలకు తాళాలు తప్పెట్లు వాయించినా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇకపై బాగుంటుందనే నమ్మకం లేదు. అతడు ఎంత వంగి వంగి దండాలు పెట్టినా అమెరికా నమ్మడం లేదు. పైగా అతడి కుర్చీ లాగేసి.. అందులో మహా క్రూరుడు అసిమ్ మునీర్ ను కూర్చోపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో షరీఫ్ పరిస్థితి దారుణంగా మారింది. ట్రంప్ ధోరణివల్ల అతడి పోస్ట్ ఉంటుందో.. ఊడుతుందో అర్థం కాని పరిస్థితి.
ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. ఒక దఫా మధ్యవర్తి పాత్ర కూడా పోషించింది. పాకిస్థాన్ ఎంతో ఖర్చు పెట్టుకుని ఆ పని చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మలిదఫా కూడా శాంతి చర్చలకు తాము నాయకత్వం వహిస్తామని పాకిస్థాన్ చెబుతోంది. ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో తెలియదు. అయితే శాంతి నెలకొనే అవకాశం లేదని కొంతమంది.. పాకిస్థాన్ శాంతి చర్చలకు సారథ్యం వహించడం ఏంటని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. ట్రంప్ ట్రూత్ సోషల్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవి పాకిస్థాన్ రాజకీయాలలో ప్రకంపనలకు కారణమయ్యాయి. అరబ్ దేశాలు అబ్రహం అకార్డ్స్ లో చేరాలని పేర్కొన్న ట్రంప్..సౌదీ అరేబియా, ఖతార్ చేరతాయని, ఇరాన్ కూడా అందులో చోటు సంపాదించుకుంటుందనే నమ్మకం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రూత్ సోషల్ లో అన్నిదేశాల అధ్యక్షుల పేర్లను ట్రంప్ ప్రస్తావించారు. పాకిస్థాన్ విషయంలోమాత్రం నాలుక మడతపెట్టారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి పేరును షహబాజ్ షరీఫ్ పేరును ఆయన మర్చిపోయారు. అతడి పేరు స్థానంలో సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ పేరును ప్రస్తావించారు.దీంతో అమెరికా తదుపరి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా మునీర్ ను చేస్తుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యయుత విధానాలకు ట్రంప్ చరమగీతం పాడుతున్నారని ఓ వర్గం మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ ఇదేవిధంగా అపహరించారు. నేరగాడిగా జైల్లోపెట్టారు. ఇప్పుడు షరీఫ్ విషయంలో కూడాఇలానే చేస్తారేమోనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
