Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు.. నిర్లక్ష్యంగా ఆడుతున్నాడు. ఏదో గల్లి స్థాయి ఆటగాడిలాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు.. ఒకదాంట్లో విఫలమయ్యాడు అనుకుంటే.. మరో మ్యాచ్లో కూడా అదే పరిస్థితి.. మూడో మ్యాచ్లో కూడా అదే దుస్థితి..
ఆ ప్లేయర్ ఆట తీరు చూసిన తర్వాత.. అసలు ఇతడు టి20 లో నెంబర్ వన్ బ్యాటర్ ఏంటి అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అసలు ఇతగాడికి ఇలా విఫలమవుతుంటే ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని మేనేజ్మెంట్ తీరును తప్పు పడుతున్నారు. ఇలా విఫలమవుతున్న ఆటగాడి పేరు అభిషేక్ శర్మ.
ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఐలాండ్ సిరీస్లో చేతులెత్తేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా తలవంచాడు. వాస్తవానికి అతని ప్లేస్ లో ఇంకో ఆటగాడు గనుక ఉండి ఉంటే రిజర్వ్ బెంచ్ లో ఉండేవాడు. లేదా ఇంటిదగ్గర గోర్లు గిల్లుకుంటూ మ్యాచ్ చూసేవాడు. కానీ అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండడంతో.. అవకాశం దక్కించుకున్నాడు.
జింబాబ్వే సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు అభిషేక్ శర్మ. ఓపెనర్ గా వచ్చిన అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జింబాబ్వేలాంటి జట్టు మీద కూడా అతడు ఆడలేక పోతున్నాడు అంటే.. ఇక మిగతా జట్ల మీద ఎలా ఆడతాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మూడు మ్యాచ్ల సిరీస్లో ఒక్క దాంట్లో కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. తొలి మ్యాచ్లో ఒకటి.. రెండో మ్యాచ్లో 8.. మూడో మ్యాచ్లో రెండు పరుగులు చేసి తన నిర్లక్ష్యాన్ని బలంగా చాటుకున్నాడు. ఇతడి ఆట తీరు చూసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు దిమ్మ తిరిగే విధంగా చేస్తున్నాయి..
గంభీర్ మాదిరిగానే ఇతడిని కూడా షెడ్డుకి పంపించాలని.. అప్పుడే సెట్ అవుతాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతంలో అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ మరుసటి మ్యాచ్ లో సత్తా చూపించేవాడు. కానీ ఇప్పుడు వరుసగా విఫలమవుతున్నాడు. షాట్ల ఎంపిక సరిగ్గా లేదు. దూకుడు కనిపించడం లేదు. ఎటాకింగ్ ఏమాత్రం లేదు. ఇలాంటి స్థితిలో అభిషేక్ శర్మను జూనియర్ యువరాజ్ సింగ్ అని ఎందుకు పిలవాలో అర్థం కావడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


