Taliban Afghanistan India: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత శక్తిని ప్రపంచానికి చాటింది. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు శత్రువులు ఎవరో.. మిత్రులు ఎవరో కూడా తేలిపోయింది. ఇస్లాం దేశమైన పాకిస్తాన్‌కు అనేక ఇస్లాం దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా భారత్ పాక్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తోంది. ఇందులో భాగంగా పలు దేశాల్లో పర్యటించారు. పాకిస్తాన్‌ను ఒంటరి చేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ల విషయంలోనూ కీలకంగా వ్యవహరించింది.
ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్..
వాస్తవానికి తాలిబాన్లు మనకు వ్యతిరేకులు. గతంలో భారత విమానాన్ని హైజాక్ చేసి మజూద్ అజర్ వంటి కరుడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకుపోయారు. ఇదే సమయంలో తాలిబాన్లు అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం. దీంతో తాలిబాన్ పాలనకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. అయితే ఇటీవల పరిస్థితులు భారత విదేశాంగ విధానంలో మార్పులు తెచ్చాయి. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ విధానాల కారణంగా అక్కడి మహిళలు, బాలికలు అణచివేతకు గురవుతున్నారు. అక్షరాస్యతకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో వారిని రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలని ఐక్యరాష్ట్ర సమితి జనరల్ అసెంబ్లీ జర్మనీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం 116 ఓట్లతో ఆమోదం పొందగా, అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు వ్యతిరేకించాయి. భారత్, చైనా, రష్యా, ఇరాన్ సహా 12 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉన్నాయి.
Also Read: KA Paul Nimisha Priya Case: కేఏ పాల్ అడుగుపెట్టాడు.. యెమెన్ లో నిమిష ప్రియకు ఉరిశిక్ష ఆగిపోయిందట..
ఓటింగ్‌కు దూరానికి కారణం ఇదే..
భారత్ ఈ తీర్మానంపై ఓటు వేయకపోవడానికి పలు రాజకీయ, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తాలిబాన్‌తో సంబంధాల మెరుగుదల. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్‌తో అధికారిక గుర్తింపు లేనప్పటికీ, ఇటీవలి కాలంలో సంబంధాలు మెరుగుపడ్డాయి. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్ ఖండించడాన్ని భారత్ స్వాగతించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇది రెండు పక్షాల మధ్య సంబంధాలు బలపడుతున్నట్లు సూచిస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వం భారత్‌కు ప్రాధాన్యత కలిగిన అంశాలు. భారత్ ఆఫ్ఘన్ ప్రజలతో చారిత్రక స్నేహాన్ని కొనసాగిస్తూ, 2021 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు, 330 మెట్రిక్ టన్నుల ఔషధాలు, వ్యాక్సిన్లు, ఇతర అవసరమైన వస్తువులను మానవతా సాయంగా అందించింది. అలాగే, 2,000 మంది ఆఫ్ఘన్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించింది. ఈ సందర్భంలో కఠినమైన తీర్మానానికి మద్దతు ఇవ్వడం ఈ సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని భారత్ భావించింది.
ఉగ్రవాద వ్యతిరేక పోరు..
ఓటింగ్‌కు దూరంగా ఉండడానికి భారత్ ఇచ్చిన వివరణలో లష్కర్–ఎ–తొయిబా, జైష్–ఎ–మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు, వాటి ప్రాంతీయ మద్దతుదారులపై (పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి) కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తీర్మానంలో ఈ అంశంపై స్పష్టత లేకపోవడం కూడా భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండటానికి ఒక కారణం. భారత్ తన విదేశాంగ విధానంలో వ్యూహాత్మక సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాలిబాన్‌ను పూర్తిగా వ్యతిరేకించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రాంతీయ స్థిరత్వం, భారత్ ఆసక్తులకు హాని కలిగే అవకాశం ఉంది. అందుకే సంప్రదింపులు, సహకారంతో కూడిన విధానాన్ని భారత్ ఎంచుకుంది.
Also Read:Wooden boat: ఓ చెక్క పడవ.. దానిపై అతడి హావభావాలు.. ఈ బుడ్డోడిని దేశానికి రాయబారిని చేశాయి..
దీర్ఘకాలిక లక్ష్యాలతో..
భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండటం భౌగోళిక–రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా మారుతున్న విదేశాంగ విధానాన్ని సూచిస్తుంది. ఇది తాలిబాన్ ఆడవాళ్లపై అణచివేతను సమర్థించడం కాదు, బదులుగా ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు ఒక వ్యూహాత్మక ఎంపిక. పాకిస్తాన్‌తో పోలిస్తే, భారత్ ఈ సమస్యను మరింత సమతుల్యంగా, ఆచరణాత్మకంగా సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది, ఇది ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సాయం, అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతుంది.