Mark Zuckerberg: బైడెన్‌పై బాంబు పేల్చిన మెటా సీఈవో.. అధ్యక్షుడిపై సంచలన ఆరోపణ చేసిన మార్క్‌ జుకర్‌బర్గ్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. దీంతో ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

Written By: Raj Shekar, Updated On : August 27, 2024 12:01 pm

Mark Zuckerberg

Follow us on

Mark Zuckerberg: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ.. ఎవరు ఎటువైపు ఉన్నారో తేలిపోతోంది. ఇప్పటికే బిలియనీయర్‌ ఎలాన్‌ మస్క్‌.. ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఎన్నికల కోసం భారీగా ఆర్థిక సాయం కూడా చేశారు. ఇక ఇప్పుడు మరో బిలియనీర్‌ కూడా ట్రంప్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా ఎన్నికల్లో ట్రంప్‌కు మేలు జరిగేలా వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటున్న సమయంలో అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో సోషల్‌ మీడియా జెయింట్‌ మెటా చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ బాంబు పేల్చారు. అధ్యక్షుడు జో బిడెన్‌– ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సారథ్యంలోని ప్రభుత్వం తనను చాలా ఇబ్బంది పెట్టిందని, పదేపదే ఒత్తిళ్లకు గురి చేసిందని ఆరోపించాడు. కోవిడ్‌కు సంబంధించిన పోస్ట్‌లను సెన్సార్‌ చేయాలంటూ మెటా/ఫేస్‌బుక్‌పై అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు యూఎస్‌ కాంగ్రెస్‌ హౌస్‌ జ్యుడిషియరీ కమిటీకి మార్క్‌ జుకర్‌బర్గ్‌ లేఖ రాశారు. రెండు పేజీల లేఖ ఇది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆగస్టు 26వ తేదీన జ్యుడీషియరీ కమిటీకి దీన్ని పంపించారు జుకర్‌బర్గ్‌.

లేఖలో ఇలా..
జూకర్‌బర్గ్‌ రాసిన ఈ లేఖను జ్యుడీషియరీ కమిటీ తన అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు జుకర్‌బర్గ్‌. జో బైడెన్‌– కమలా హారిస్‌ ప్రభుత్వం అమెరికన్ల కోవిడ్‌ సమాచారాన్ని సెన్సార్‌ చేయమని ఫేస్‌బుక్‌పై ఒత్తిడి చేసిందని, బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ వివాదాస్పద ల్యాప్‌టాప్‌ కథనాలను కూడా పోస్ట్‌ కానివ్వకుండా అడ్డుకున్నాడని పేర్కొన్నారు. 2021లో వైట్‌ హౌస్‌ సీనియర్‌ అధికారుల నుంచి తనకు లేఖలు అందాయని వివరించారు. కోవిడ్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ మొదలుకుని ఎలాంటి కంటెంట్‌ అయినా సరే.. దాన్ని సెన్సార్‌ చేయమంటూ నెలల తరబడి ఒత్తిడి తెచ్చారని స్పష్టం చేశారు. చివరకు వాటికి తలవంచాల్సి వచ్చిందని తెలిపారు. కంటెంట్‌ను సెన్సార్‌ చేయడానికే తుది నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్‌ వెల్లడించాడు. కోవిడ్‌ కంటెంట్‌ను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించాలా? వద్దా అనేది తమ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో కొన్ని మార్పులతో అవి పోస్ట్‌ చెయ్యాల్సి వచ్చిందని వివరించారు.

బయట పెట్టినందుకు బాధపడుతున్నా..
స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలియజేయాల్సిన ఓ బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఒత్తిడికి గురి చేయడం సరికాదని జూకర్‌బర్గ్‌ లేఖలో పేర్కొన్నారు. తనకు వైట్‌ హౌస్‌ అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురైనప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టనందుకు చింతిస్తున్నాను అని లేఖలో స్పష్టం చేశారు. ఆ సమయంలో ప్రభుత్వపరమైన ఒత్తిళ్ల కారణంగా తమ కంటెంట్‌ ప్రమాణాలపై రాజీ పడకూడదని నిర్ణయించుకున్నామని, ఇదే విషయాన్ని తన టీమ్‌కూ వివరించానన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే వాటిని కచ్చితంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

గతంలో ట్రంప్‌ ఖాతా తొలగింపు..
ఇదిలా ఉంటే 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్‌ ఓడిపోయాడు. ఆ తర్వాత అతను వైట్‌హౌస్‌పై దాడికి యత్నిచాడు. గొడవలు సృష్టించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో జూకర్‌బర్గ్‌ ట్రంప్‌ ఖాతాను పేస్‌బుక్‌ నుంచి తొలగించారు. ఇటీవలనే తిరిగి పునరుద్ధరించారు. తాజాగా ట్రంప్‌ను మచ్చిక చేసుకునేందుకు బైడెన్‌పై సంచలన లేఖ రాశారు. తద్వారా పరోక్షంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ వైపు నిలుస్తున్నట్లు ప్రకటించారు.