https://oktelugu.com/

PM Modi: యుద్ధ భూమిలో అడుగు పెట్టిన మోదీ.. రెండున్నరేళ్ల రణానికి బ్రేక్‌ వేస్తారా?

మూడోసారి ప్రధాని అయ్యాక నరేంద్రమోదీ విదేశీ పర్యటనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో ఆయన మూడుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. మొదట ఇటలీ, తర్వాత రష్టా.. ఇప్పుడు పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 23, 2024 / 03:58 PM IST

    PM Modi

    Follow us on

    PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమయం చేశారు. ఇక రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, ఈసారి టీడీపీ, జేడీయూ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వమే అయినా.. నిర్ణయాలను మాత్రం మోదీ స్వేచ్ఛగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వారానికి ఆయన ఇటలీ ప్యటనకు వెళ్లారు. తర్వాత నెల రోజులకు రష్యాలో పర్యటించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా పోలాండ్, ఉక్రెన్‌ పర్యటనలో ఉన్నారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం 40 ఏళ్ల తర్వాత ఇదే. ఇక ఉక్రెయిన్‌లో పర్యటించడం 30 ఏళ్ల తర్వాత ఇదే. పోలండ్‌తో వాణిజ్య ఒప్పందం జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలాండ్‌ వెళ్లారు. ఇక ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 దేశాల సదస్సుకు వెళ్లిన మోదీ.. అక్కడ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిశారు. జెలన్‌స్కీ మోదీని తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. ఈమేరకు పోలాండ్‌ వెళ్లిన మోదీ.. అటునుంచి అటే ఉక్రెయిన్‌ వెళ్లారు. దాదాపు రెండున్నరేళ్లకుపైగా యుద్ధంతో కునారిల్లుతున్న ఉక్రెయిన్‌లో మోదీ అడుగు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మిత్రదేశమైన రష్యా సైనిక చర్యను నిలిపివేసేలా మోదీ చేయగలరా అన్న ఆసక్తి నెలకొంది.

    రైలు మార్గంలో ఉక్రెయిన్‌కు..
    భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 7.30 గంటలకు ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. పోలాండ్‌ నుంచి ఆయన బయల్దేరిన రైలు కీవ్‌కు చేరుకుంది. రైల్వేస్టేషన్‌ నుంచి ఆయన వాహన కాన్వాయ్‌ బయల్దేరి బస చేయనున్న ప్రదేశానికి వెళ్లింది. ఆగస్టు 21న పోలెండ్‌ రాజధాని వార్సాలో మోదీ ఆ దేశాధ్యక్షుడు ఆంద్రెజ్‌ దూదా, ప్రధానమంత్రి డొనాల్డ్‌ టస్క్‌తో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, రక్షణ ఒప్పందాలపై చర్చించారు. మోదీ.. పోలెండ్‌ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగింది. గురువారం పోలాండ్‌ పర్యటన ముగించుకున్న మోదీ రైలు మార్గంలో ఉక్రెయిన్‌ బయల్దేరారు. దాదాపు 10 గంటలు ప్రయాణించి కీవ్‌కు చేరుకున్నారు. భారత్‌ ఏ పక్షం వహించదని.. కేవలం శాంతికి మాత్రం వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు. ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రతా కారణాలతో రహస్యంగా ఉంచారు. ఇదిలా ఉండగా కీవ్‌కు చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్‌ వద్ద భారత పతాకాలతో స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లోని ఇస్కాన్‌ బృంద సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు.

    జలెన్‌స్కీతో భేటీ..
    ఉక్రెయిన్‌లో మోదీ దాదాపు 7 గంటలపాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట ఆయన ఆదేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బేటీ అవుతారు. స్థానిక ఏవీ ఫొమిన్‌ బొటానికల్‌ గార్డెన్లోని మహాత్మాగాంధీ. కాంస్య విగ్రహానికి ప్రధాని నివాళి అర్పించనున్నారు. దీనిని 2020లో గాంధీ 151వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేశారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్‌ నేషనల్‌ మ్యూజియంను కూడా ప్రధాని సందర్శిస్తారు. రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు ఇక్కడ ఆయన నివాళి అర్పిస్తారు. ఈ మ్యూజియంలో ఉక్రెయిన్‌ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లను ఆయన వీక్షించనున్నారు. 1991లో సోవియట్‌ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

    యుద్ధ సమయంలో పర్యటన..
    సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ.. ఉక్రెయిన్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ దేశాధ్యక్షుడు వొల్డిమిర్‌ జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ప్రత్యేకించి– ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించనున్నారు.