Google: గూగుల్‌కు ఇజ్రాయెల్‌ సెగ.. ఉద్యోగుల అరెస్ట్‌.. అసలేం జరిగిందంటే..

హమాస్‌–గాజా మధ్య ఇప్పటికే యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో గూగుల్‌ ఉద్యోగుల్లో కొందరు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 12:01 pm

Google

Follow us on

Google: ప్రపంచ దేశాల మధ్యనెలకొన్న రాజకీయ, భౌగోళిక వివాదాలు ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలకూ తాకుతున్నాయి. ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌–హమాస్‌పై దాడులు చేస్తోంది. ఇంకోవైపు ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయన్న భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉండగా.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రముఖ దిగ్గజ టెక్‌ కంపెనీ నిరసన గళం ఎత్తుకుంది. ఉద్యోగులు ఏకంగా కంపెనీ క్లౌడ్‌ సీఈవోనే ఎదురించే స్థాయికి వెళ్లారు. రూ.10 వేల కోట్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. చివరకు అలా నిరసనకు దిగిన ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఏం జరిగిందంటే..
హమాస్‌–గాజా మధ్య ఇప్పటికే యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో గూగుల్‌ ఉద్యోగుల్లో కొందరు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. అందులో భాగంగా కాలిఫోర్నియాలోని గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌ ఛాంబర్‌ను చుట్టుముట్టారు. ఇజ్రాయెల్‌తో కంపెనీ చేసుకున్న ఒప్పందాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన దాదాపు 8 గంటలపాటు సాగింది. ఈ నిరసన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఉద్యోగులకు సెలవు..
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగిన ఉద్యోగులకు గూగుల్‌ సెలవు ప్రకటించింది. అడ్మినిస్ట్రేటివ్‌ లీవులో ఉద్యోగులను ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. ఇక సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నిరసన వీడియలో వారు కూర్చున్న గది ముందు డ్రాప్‌ నింబుస్‌ బ్యానర్‌ కనిపిస్తుంది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో గతంలో గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకుంది. దాని పేరు ‘ప్రాజెక్టు నింబుస్‌’. ఈ ప్రాజెక్టు విలువ 1.2 బిలియన్‌ డాలర్లు(రూ.10వేల కోట్లు). ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల వ్యవహారంపై కంపెనీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.