https://oktelugu.com/

Ethiopia: దారుణం.. పెళ్లికి వెళ్తుండగా ఘోరం.. 71 మంది దుర్మరణం

వారంతా పెళ్లికి వెళ్తున్నారు. వధూవరులిద్దరూ దగ్గరి బంధువులు కావడంతో ఆ వివాహ వేడుకకు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించి.. విందు వినోదాలలో తేలిపోవాలని భావించారు. కానీ వారు ఒకటి ఊహిస్తే.. దైవం మరొకటి ఊహించింది. అంతిమంగా జరగకూడని దారుణం జరిగింది.

Written By:
  • Bhaskar
  • , Updated On : December 30, 2024 / 04:35 PM IST

    Ethiopia

    Follow us on

    Ethiopia: ఇథియోపియాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ వాహనం నదిలో పడిపోయింది. దీంతో 71 మంది కన్నుమూశారు.. ఇథియోపియాలోని దక్షిణ సిడామ ప్రాంతానికి చెందిన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోనా అనే జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.. వివాహ వేడుకకు వాహనంలో బంధువులు తరలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నదిలో వాహనం పడిపోవడంతో సుమారు 68 మంది పురుషులు చనిపోయారు. మరో ముగ్గురు మహిళలు మృతుల్లో ఉన్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం యువకులే ఉన్నారు. చనిపోగా గాయాలతో మిగిలిన వారిని బోనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలామంది అత్యవసర వైద్య విభాగం లో చికిత్స పొందుతున్నారు. ఇథియోపియా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు వారంతా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల స్థానికులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అంబులెన్సులు.. ఇతర వాహనాల రాకతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    ప్రమాదం ఎలా జరిగిందంటే?

    పెళ్లికి వెళ్తున్న వాహనం.. నదికి దగ్గరలో ఉన్న రోడ్డు మీద అదుపుతప్పింది. వాహనంలో జనం భారీగా ఉండడం.. దానిని అదుపు చేయలేక డ్రైవర్ చేతులెత్తేయడంతో ఒక్కసారిగా నదిలోకి తీసుకెళ్లింది. నదిలో నీరు ఉండడం.. వాహనం పడిన ప్రాంతం మొత్తం రాళ్లతో నిండి ఉండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. రాళ్ల మధ్య వాహనం ఇరుక్కుపోవడంతో చాలామంది ఊపిరి ఆడక చనిపోయారు. కొంతమంది తలలు రాళ్లకు గుద్దుకొని తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. అందువల్లే మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు అంటున్నారు..” వాహనం నదిలో పడిన ప్రమాదంలో చాలామంది చనిపోయారు. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున అంబులెన్స్ లు తరలించి సహాయక చర్యలు చేపడుతున్నాం. మృతుల సంఖ్య ప్రస్తుతానికైతే 71 కు చేరుకుంది. ఇందులో యువకులు ఎక్కువగా ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం. వారికి మెరుగైన వైద్యం అందేలాగా కృషి చేస్తున్నాం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని” ఇథియోపియా అధికారులు తెలిపారు. ” చనిపోయిన వాళ్ళు కాకుండా.. గాయపడిన వారు కాకుండా.. నీళ్లలో ఎవరైనా ఉన్నారా అనే దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నాం. అయితే ఇప్పటివరకు ఎవరి ఆచూకీ మాకు లభించలేదు.. అయినప్పటికీ ఎవరైనా ఉంటారని ఆశతో.. పరిశీలిస్తున్నాం. ఎవరైనా ఉంటే కాపాడే అవకాశం ఉంటుంది.. అయితే ఇప్పటివరకు మాకు ఎవరూ నదిలో కనిపించలేదని” అధికారులు వివరిస్తున్నారు.