Donald Trump : తగ్గిన ట్రంప్‌ మైలేజీ… కమలా హ్యారిస్‌ రాకతో మారుతున్న ఈక్వేషన్స్‌!

అమెరికా అధ్యక్ష అభ్యర్థిపై డెమొక్రటిక్‌ పార్టీలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బైడెన్‌ స్థానంలో కమలా హ్యారిస్‌ పోటీ చేయడం ఖాయమైంది. ఇక ఎన్నికలే తరువాయి. కమలా హ్యారిస్‌ను అధికారికంగా ప్రకటించ ముందే అమెరికాలో ఈక్వేషన్స్‌ మారిపోతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : July 28, 2024 8:28 pm
Follow us on

Donald Trump  : అగ్రరాజ్యం అమెరికా గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల కొరత ఎన్నుకుంటున్న తరుణంలో.. అమెరికన్లకు ఆశాదీపం అయ్యారు భారత సంతతి మహిళా నేత, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌. అధికారంలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేయడం దాదాపు ఖరారైంది. మొదట పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు బైడెన్‌ బరిలో నిలిచారు. కానీ, అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హ్యారిస్‌ రేసులోకి వచ్చారు. అయితే అధికారికంగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. కానీ, ఇప్పటికే కమలాకు అధ్యక్షుడు బైడెన్‌తోపాటు బిల్‌ క్లింటన్, బారక్‌ ఒబామా మద్దతు ప్రకటించారు సీనియర్లు చాలా మంది కమలే సరైన అభ్యర్థి అని అభిప్రాయపడుతున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఆమె మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష అభ్యర్థికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారంతో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్‌ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అధికారిక ప్రకటన తర్వాత కమలా ప్రచారంలో దిగనున్నారు. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థిగా బైడెన్‌ తప్పుకోవడం, హ్యారిస్‌కు మద్దతు తెలుపడం, తర్వాత జరుగుతున్న పరిణామాలతో కమలాకు ప్రచారం చేయకున్నా.. కావాల్సినంత మైలేజీ వస్తోంది. ఇదే సమయంలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ మైలేజీ తగ్గుతోంది. దీంతో ట్రంప్‌కు పోటీ ఇచ్చే నేత హ్యారిసే అని డెమెక్రటిక్‌ పార్టీ నేతలోపాటు అమెరికన్లు కూడా భావిస్తున్నారు.

బైడెన్‌ తప్పుకోవడంతో..
డెమోక్రటిక్‌ అభ్యర్థిగా రేసులోకి కమలా హారిస్‌ రాకతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పరిణామాలు మారినట్లు తెలుస్తోంది. ఇదివరకు బైడెన్‌పై దూకుడు కనబర్చిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కమలా విషయంలో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆధిక్యం తగ్గినట్లు. ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు తాజా పోల్‌ సర్వేల్లో తేలింది. సొంత పార్టీతోపాటు శ్వేతజాతియేతర ఓటర్లలోనూ కమలాకు మద్దతు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ తాజా సర్వేలో 49, 47 పాయింట్లతో కమలా, ట్రంప్ల మధ్య పోటాపోటీ నెలకొంది. అయితే.. ఇందులో అటూఇటు 3.1 పాయింట్ల తేడా ఉండొచ్చని సర్వే పేర్కొంది. జులై ప్రారంభంలో బైడెన్‌ ట్రంప్‌ ఆరు పాయింట్ల ఆధిక్యం కనబర్చారు. అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసునుంచి బైడెపఖ ఇటీవల వైదొలగడంతో కమలా రేసులోకి వచ్చారు.

కొన్ని సర్వే ఫలితాలు ఇలా..
– ‘న్యూయార్క్‌ టైమ్స్‌/సియనా కాలేజీ పోల్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. స్వల్ప తేడాతో కమలా (47 శాతం)పై ట్రంప్‌ (48 శాతం) ఆధిక్యంలో ఉన్నారు. జులై ప్రారంభంతో పోలిస్తే డెమోక్రాట్లకు ఆదరణ పెరిగింది. ఆ సమయంలో ట్రంప్‌ తో పోలిస్తే బైడెన్‌ ఆరు పాయింట్ల వెనుకంజలో ఉన్నారు.

– రిజిస్టర్డ్‌ ఓటర్ల విషయంలో ట్రంప్‌ ముందంజలో కొనసాగుతున్నట్లు సర్వేలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ట్రంప్‌కు 48 శాతం, కమలాకు 46 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలిపాయి. అంతకుముందు బైడైన్‌పై ఆయన తొమ్మిది పాయింట్ల ఆధిక్యం కనబర్చారు.

– నెల క్రితం ’న్యూయార్క్‌ టైమ్స్‌’ పోల్లో నల్లజాతి నమోదిత ఓటర్ల నుంచి బైడెన్‌కు 59 శాతం మంది మద్దతు లభించగా.. ప్రస్తుతం కమలా విషయంలో ఇది 69 శాతానికి చేరుకున్నట్లు అంచనా. లాటిన్‌ ఓటర్ల నుంచి డెమోక్రటిక్‌ పార్టీకి ఆదరణ 45 శాతం నుంచి 57 శాతానికి పెరగడం విశేషం.

– బైడెన్‌ వైదొలిగిన తర్వాత నిర్వహించిన పోల్స్‌ సగటు ప్రకారం.. ట్రంప్‌ కంటే హారిస్‌ 1.6 శాతం పాయింట్లతో వెనుకంజలో ఉన్నట్లు ’బ్లూమ్బర్గ్‌’ తెలిపింది.