Kamala Harris : అధ్యక్ష బరిలో కమలా హ్యారిస్‌.. డెమొక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ.. తగ్గిన ట్రంప్‌ మైలేజీ!

అమెరికా అధ్యక్ష అభ్యర్థిపై డెమొక్రటిక్‌ పార్టీలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బైడెన్‌ స్థానంలో కమలా హ్యారిస్‌ పోటీ చేయడం ఖాయమైంది. ఇక ఎన్నికలే తరువాయి.

Written By: Raj Shekar, Updated On : July 28, 2024 8:16 pm
Follow us on

Kamala Harris : అగ్రరాజ్యం అమెరికా గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల కొరత ఎన్నుకుంటున్న తరుణంలో.. అమెరికన్లకు ఆశాదీపం అయ్యారు భారత సంతతి మహిళా నేత, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌. అధికారంలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేయడం దాదాపు ఖరారైంది. మొదట పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు బైడెన్‌ బరిలో నిలిచారు. కానీ, అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హ్యారిస్‌ రేసులోకి వచ్చారు. అయితే అధికారికంగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. కానీ, ఇప్పటికే కమలాకు అధ్యక్షుడు బైడెన్‌తోపాటు బిల్‌ క్లింటన్, బారక్‌ ఒబామా మద్దతు ప్రకటించారు సీనియర్లు చాలా మంది కమలే సరైన అభ్యర్థి అని అభిప్రాయపడుతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఆమె మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష అభ్యర్థికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారంతో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్‌ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అధికారిక ప్రకటన తర్వాత కమలా ప్రచారంలో దిగనున్నారు. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థిగా బైడెన్‌ తప్పుకోవడం, హ్యారిస్‌కు మద్దతు తెలుపడం, తర్వాత జరుగుతున్న పరిణామాలతో కమలాకు ప్రచారం చేయకున్నా.. కావాల్సినంత మైలేజీ వస్తోంది. ఇదే సమయంలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ మైలేజీ తగ్గుతోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. దీంతో ట్రంప్‌కు పోటీ ఇచ్చే నేత హ్యారిసే అని డెమెక్రటిక్‌ పార్టీ నేతలోపాటు అమెరికన్లు కూడా భావిస్తున్నారు.
కమలా నేపథ్యం..
కమలా హ్యారిస్‌ పూర్తి పేరు కమలాదేవి హ్యారిస్‌.. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్‌ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌. జమైకాకు చెందిన వ్యక్తి అర్థశాస్త్ర ప్రొఫెసర్‌. అమెరికాలో జన్మించిన కమలా.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్‌ కాబట్టి ఆఫ్రికన్‌ అమెరికన్‌ అయ్యారు. కమలా హ్యారిస్‌ కూడా తండ్రిలా అర్ధశాస్త్రంలో డిగ్రీ చేశారు. హెూవార్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టరేట్‌ అందుకున్నారు.

అటార్నీ జనరల్‌గా..
హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే హ్యారిస్‌ విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీగా పని చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో కెరీర్‌ క్రిమినల్‌ యూనిట్లో మేనేజింగ్‌ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్‌ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.

సెనేటర్‌ నుంచి తక్కువ టైంలో..
ఇక 2017లో క్యాలిఫోర్నియా సెనెటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్‌ మోస్లే తర్వాత అమెరికన్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో అడుగు పెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్‌ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్‌ ప్రెసిడెంట్‌ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్‌ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.