INDW vs SLW : ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఓటమిపాలైంది. దంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. మెగా టోర్నీలో తొలిసారిగా విన్నర్ గా నిలిచింది. ఈ టోర్నీలో వరుసగా విజయాలు సాధించి.. సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను మట్టి కరిపించి ఫైనల్ దాకా వచ్చిన భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్ లో ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది.. సెమీఫైనల్ దాకా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో దూకుడు ప్రదర్శించిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన.. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. ప్రత్యర్థి జట్టు ముందు తలవంచింది. ఫలితంగా ఆసియా కప్ కోల్పోయింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా శ్రీలంక తొలిసారి విజేతగా ఆవిర్భవించింది.. ఏకంగా 8 వికెట్ల తేడాతో భారత జట్టును మట్టికరిపించి ఆసియా కప్ ఎగరేసుకుపోయింది.. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఓపెనర్ చమరి ఆటపట్టు (61), హర్షిత సమర విక్రమ (69*) సిసలైన దూకుడు ప్రదర్శించి భారత బౌలింగ్ ను చీల్చి చెండాడారు.
ఈ మ్యాచ్ లో భారత ఫీల్డర్లు అత్యంత చెత్త ఫీల్డింగ్ చేశారు. భారత ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్ ను శ్రీలంక బ్యాటర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. భారత్ విధించిన 166 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. ఆరవ ప్రయత్నంలో ఆసియా కప్ ట్రోఫీని దర్జాగా అందుకుంది. ఇప్పటివరకు ఆసియా కప్ ను భారత్ ఏడుసార్లు దక్కించుకుంది. ఎనిమిదో సారి కూడా ట్రోఫీ దక్కించుకోవాలని భారత జట్టు భావించగా.. శ్రీలంక టీమిండియా అంచనాలను తలకిందులు చేస్తూ తొలిసారిగా టైటిల్ దక్కించుకుంది. భారత విధించిన 167 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే సాధించింది..అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 166 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన (60) మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకుంది.. మిడిల్ ఆర్డర్లో జెమీమా(29) దూకుడుగా బ్యాటింగ్ చేయగా.. చివర్లో వచ్చిన రీచా ఘోష్ (30) మైదానంలో బౌండరీలతో విరుచుకుపడింది. ముఖ్యంగా కవిష వేసిన 19 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టింది. ఒక సిక్సర్ బాదింది. తన దూకుడైన బ్యాటింగ్ తో జట్టు స్కోర్ 150 పరుగులు దాటించింది. చివరి ఓవర్ లోనూ రీచా బౌండరీ కొట్టి అవుట్ అయింది. ఫలితంగా టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 166 రన్స్ చేసింది.
టీమిండియా విధించిన 167 రన్స్ టార్గెట్ ను చేదించేందుకు రంగంలోకి దిగిన శ్రీలంక జట్టు.. ఓపెనర్ విష్మీ (1) క్రికెట్ త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ చమరి (61) దూకుడుగా ఆడింది. ఈ మెగా టోర్నీలో తొలి సెంచరీ సాధించిన ఆమె.. మరో బ్యాటర్ సమర విక్రమతో కలిసి మైదానంలో విధ్వంసాన్ని సృష్టించింది. అయితే ఈ జోడిని విడదీసేందుకు హర్మన్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఆఫ్ సెంచరీ తర్వాత ఆటపట్టు దీప్తి శర్మ బౌలింగ్లో ఔట్ అయింది. ఆ తర్వాత వచ్చిన దిల్హార (30*) తో కలిసి సమర విక్రమ (69*) దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది.. వీరిద్దరూ భారత బౌలర్ల బౌలింగ్ ను తుత్తునీయలు చేస్తూ శ్రీలంకకు తొలిసారి ట్రోఫీ అందించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూనే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తారు.. వాస్తవానికి సమర విక్రమ 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులువైన క్యాచ్ భారత కెప్టెన్ హర్నన్ వదిలేసింది. ఒకవేళ గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ భారత్ వైపు మొగ్గేది. ఆ తర్వాత రెచ్చిపోయిన సమర విక్రమ, దిల్హరా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. పూజా వేసిన 19వ ఓవర్ 4వ బంతిని దిల్హరా స్టాండ్స్ లోకి పంపింది. శ్రీలంక జట్టులో సంబరాలు మిన్నంటాయి. ఆసియా కప్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలవడంతో లంక క్రికెటర్లు వేడుకలు జరుపుకున్నారు.. ఫైనల్ మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్, పసలేని బౌలింగ్ తో భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.