China And Pakistan: ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ పుట్టాడు? ఎక్కడ ఉగ్రవాదాన్ని నేర్చుకున్నాడు? ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేశాడు? అమెరికాలో జంట టవర్లను ఎందుకు కూల్చాడు? ఆ తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాడు? చివరికి ఎక్కడ కన్ను మూశాడు? పోనీ ఐ ఎస్ ఐ ఎక్కడ పుట్టింది? దాని అసలు ఉద్దేశం ఏమిటి? దానిమీద నిషేధం ఎందుకు ఉంది? లేకుంటే జైషే మహమ్మద్ అనే సంస్థ ఎక్కడ పురుడు పోసుకుంది? అది ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది? దానిపైన నిషేధం ఎందుకు ఉంది? ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం అది పాకిస్తాన్. అక్కడ తినడానికి తిండి ఉండదు. తాగడానికి నీరు ఉండదు. బతకడానికి అనువైన ప్రాంతం ఉండదు. కానీ కాల్చేందుకు తుపాకులు ఉంటాయి. విసరడానికి బాంబులు ఉంటాయి. సాటి మనిషిని చంపడానికి ఆయుధాలు ఉంటాయి. విద్వేషాన్ని నూరిపోసే సంస్థలు ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే అది ఒక ఉగ్రవాద తండా.. అందుకే కదా ఆ దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. విద్య, వైద్యం, ఇలా కనీస వసతుల కల్పనలో అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసింది. అస్థిరతకు మారుపేరయిన ఆ దేశానికి చైనా దగ్గరయింది. ఐఎంఎఫ్ లాంటి సంస్థలు ఛీ పొమ్మంటే.. చైనా అక్కున చేర్చుకొని డబ్బులు ఇస్తోంది. ఆల్రెడీ గదర్ లాంటి పోర్టును రాసుకుంది. మునుముందు ఏం చేస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే చైనా పాకిస్తాన్ దేశాన్ని తనకబంధహస్తాల్లో బంధించింది.
తన వ్యాపార అవసరాలకు ఎలాంటి దేశాలనైనా నాశనం చేయగలే సత్తా చైనాకుంది. టిబెట్, మయన్మార్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలు చైనా వల్ల ఎంత నాశనం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి పాకిస్తాన్ కూడా చేరిపోయింది. సహజంగానే భారత్ అంటే పాకిస్తాన్ కు, చైనాకు మంట. పైగా ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేల కోట్ల విలువైన ఒప్పందాల మీద సంతకాలు చేశారు. సహజంగానే ఈ పరిణామంపై చైనా తన అక్కసు వెళ్ళగక్కింది. ఇది సరైన పద్ధతి కాదంటూ పరోక్షంగా నొసలు చిట్లించింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదంపై చైనా మాట్లాడింది. పైగా పాకిస్తాన్ దేశం భారత్ పై ఆరోపణలు చేయడంతో వెంటనే చైనా గొంతు సవరించుకుంది.
ఇటీవల పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద కార్యకర్తలు నిర్వహిస్తున్న కొంతమంది వ్యక్తులు హతమవుతున్నారు. ఎవరో వచ్చి ఉగ్రవాదులను చంపేస్తున్నారు. కానీ ఆ ఉగ్రవాదుల హతం పట్ల పాకిస్తాన్ దేశంలో ఎటువంటి నిరసనలు వ్యక్తం కావడం లేదు. పైగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మర్చిపోయి పాకిస్తాన్ దేశం భారత్ పై విమర్శలు చేసింది. “ఉగ్రవాదం పేరుతో పాకిస్థాన్ పౌరులను చంపేస్తున్నారు. దీని వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉంది.. ఇది సరైన చర్య కాదు. భారత్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది” అని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ ఈ ఆరోపణలు చేయడమే ఆలస్యం వెంటనే చైనా విదేశాంగ శాఖ మేల్కొంది. పాకిస్తాన్ తో పాటు తను కూడా గొంతు సవరించింది. ” భారత్ అనవసరంగా కొంతమంది పౌరులను చంపేసింది.. ఇది సరైన పద్ధతి కాదు. ఉగ్రవాదంపై మా దేశానికి ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలు లేవు. పౌరుల హతానికి సంబంధించి భారత ఏజెంట్ల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయంటూ” చైనా ప్రకటించింది. కానీ ఇక్కడ ఈ రెండు దేశాలు మర్చిపోతున్నది ఏంటంటే.. మసూద్ హజార్ కు సంబంధించి భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానం చేసింది. అతడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని, పాకిస్తాన్ అతడికి ఆశ్రయం ఇస్తోందని, అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని డిమాండ్ చేసింది. అయితే దీనిని చైనా తోసిపుచ్చింది.. పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా మాట్లాడింది. అంటే అలాంటి చైనా నేడు ఉగ్రవాదంపై మాట్లాడుతూ ఉంది అంటే దయ్యాలు వేదాలు వల్లించిన సామెత గుర్తుకు వస్తోంది. పైగా పాకిస్తాన్ దేశం కూడా ఉగ్రవాదం నశించాలని వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.