https://oktelugu.com/

Pakistan On Maldives: మాల్దీవులు.. పాకిస్తాన్.. అసలేం జరిగిందబ్బా?

Pakistan On Maldives భారతదేశం తో వివాదాన్ని కోరి తెచ్చుకున్న మాల్దీవులు ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతోంది. భారతదేశ పర్యాటకంపై అక్కడి మంత్రులు తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. అది కాస్తా దౌత్యపరమైన సంఘర్షణకు దారితీసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 2, 2024 / 12:33 PM IST
    Follow us on

    Pakistan On Maldives: ఇటీవల వచ్చిన వరదలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అయినా పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితులు లేవు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశంలో ఉగ్రవాదం జడలు విప్పుకొని నాట్యం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం.. భారత్ అనే పేరు వినిపిస్తే చాలు దిగ్గున లేస్తుంది. భారత్ కు వ్యతిరేకం అంటే చాలు కయ్యానికి కాలుదువ్వుతుంది. భారత్ కు శత్రుదేశం అయితే చాలు వంగి వంగి దండాలు పెడుతుంది. గతంలో ఇలానే వ్యవహరించింది. ప్రస్తుతం అదే పద్ధతిని అనుసరించబోతోంది.

    భారతదేశం తో వివాదాన్ని కోరి తెచ్చుకున్న మాల్దీవులు ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతోంది. భారతదేశ పర్యాటకంపై అక్కడి మంత్రులు తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. అది కాస్తా దౌత్యపరమైన సంఘర్షణకు దారితీసింది. ఫలితంగా మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు అభిశంసనను ఎదుర్కొంటున్నారు. సహజంగానే చైనా అభిమాని అయిన ముయిజ్జు.. భారత వ్యతిరేక విధానాలలో అవలంబించడంలో రెండు అడుగులు ముందే ఉంటున్నాడు. ఇటీవల చైనాలో పర్యటించాడు కూడా. అయితే అతడి ధోరణి అక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులకు నచ్చడం లేదు. అందుకే అతని తీరును నిరసిస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అక్కడి పార్లమెంట్లో చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు బలమైన ఉదాహరణలు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్వర్ ఉల్హాక్ కాకర్ జరిపిన ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది.

    ప్రస్తుతం దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ దేశం మాల్దీవులకు సహాయం చేస్తామని ప్రకటించడం విశేషం. మాల్దీవుల అధ్యక్షుడి కి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఇరుదేశాల అధ్యక్ష, ప్రధాన మంత్రులు పలు విషయాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటించారు. ఇక ఈ రెండు దేశాల మధ్య 1966లో దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు కూడా చైనాకు అనుకూలమైనవి అనే ముద్రపడ్డాయి. చైనా కూడా ఈ రెండు దేశాలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల చైనా దేశాన్ని రెండు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని పాకిస్తాన్ కోరింది. ఇందుకుగాను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను విక్రయించాలని ఆ దేశం నిర్ణయించింది. అయితే రెండు బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి ఇంతవరకు చైనా పాకిస్తాన్ దేశానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు.. ఇక పాకిస్తాన్ వృద్ధిలో రెండు శాతం కోత విధిస్తూ ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా రుణం ఇస్తుందా అనేది అనుమానంగానే ఉంది. గురువారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో భారత ప్రభుత్వం.. మాల్దీవులకు కేటాయించే సాయంలో కోత విధించింది. కేవలం మాల్దీవులు మాత్రమే కాకుండా భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ కు కూడా కేటాయించే సాయంలో కోత విధించింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గాను మాల్దీవులకు కేటాయించే సాయం 600 కోట్లకు కేంద్రం తగ్గించింది. గత ఏడాది ఇది 771 కోట్లు గా ఉండేది. అయితే ఈ ఏడాది సాయాన్ని మొదట్లో 400 కోట్లకే పరిమితం చేశారు. ఆ తర్వాత సమీక్షించి పెంచారు. కొన్ని సంవత్సరాలుగా భారత్ మాల్దీవులకు సాయం చేస్తోంది. ముఖ్యంగా రక్షణ, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆ దేశానికి అండగా ఉంటున్నది. ఇటీవల ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం తలెత్తడంతో.. భారత్ అందించే సమయంలో కోతపడింది.. ఇది జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రధాని మాల్దీవుల అధ్యక్షుడు కి ఫోన్ చేయడం విశేషం.. అసలే దివాలా అంచులో ఉన్న పాకిస్తాన్ మాల్దీవులకు ఎలా సహాయం చేస్తుందనేదే ఇక్కడ అసలు ప్రశ్న.