Amaravathi capital: ఏ రాష్ట్ర రాజధానికి లేని గౌరవం అమరావతికి( Amaravathi capital ) దక్కింది. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఆయన అలా చేయకుండా ఉండి ఉంటే ఈ ఈ నిర్ణయానికి వచ్చేది కాదు కేంద్రం. ముమ్మాటికి ఇది జగన్మోహన్ రెడ్డి చొరవ. గత అనుభవాల దృష్ట్యా.. అమరావతిని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడింది. అందుకే తాము భాగస్వామ్యం అయిన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది టిడిపి. దీంతో కేంద్రం సైతం ముందుకొచ్చి అమరావతికి రక్షణగా నిలవాలని భావించింది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇందులో అధికారపక్షంతో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. దానిని సైతం గుర్తించాల్సిన అవసరం ఉంది.
రైతుల డిమాండ్ కూడా అదే..
అమరావతి విషయంలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పడాలంటే చట్టబద్ధత కావాలని రైతుల కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి మూడు రాజధానులు అంటూ అమరావతిని మార్చకుండా ఉండాలంటే చట్టబద్ధత ఒకటే శరణ్యమని పట్టుబట్టారు అమరావతి రైతులు. ఎందుకంటే ఐదేళ్లపాటు అమరావతి పై ఉక్కు పాదం మోపారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్ర రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు అమరావతిని చట్టబద్ధత కల్పించాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విన్నవించడంతో కేంద్ర ప్రభుత్వం కాదనలేకపోయింది.
ఏ రాజధానికి లేదు..
వాస్తవానికి దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. చట్టబద్ధత కల్పించిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెచ్చి అమరావతిని నిర్వీర్యం చేయడంతో ఆ భయం రైతులను వెంటాడుతోంది. అమరావతి రైతుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపింది. కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. అయితే దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని కేంద్రం చెప్పింది. చట్టబద్ధత కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే వైసిపి హయాంలో జరిగిన పరిణామాలు.. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ దానికి చెక్ పెట్టాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే న్యాయ పరిశీలన చేసి.. క్యాబినెట్ ఆమోదించి.. పార్లమెంటులో అమరావతి పై చర్చించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది కేంద్రం. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సిందే.