Buggana Rajendranath Reddy: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి() రాజకీయంగా ఒక రక్షణ కవచం ఉండేది. చుట్టూ చాలామంది నేతలు ఉండేవారు. పార్టీ ఆవిర్భావానికి ముందే విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయనతో పాటు జైలుకు వెళ్లి వచ్చారు కూడా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. అయితే ముందుగా విజయసాయిరెడ్డి అనుసరించగా తర్వాత వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇలా అంతా ఆయన చుట్టూ చేరారు. మరోవైపు మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయన ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రిగా కూడా కొనసాగారు. ఓ ఐదుగురుకు ఐదేళ్లపాటు మంత్రులుగా కొనసాగే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి బుగ్గనకు సైతం ఆ ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే బుగ్గన అటు శాసనసభలో విపక్షాలను ఒక ఆట ఆడుకున్నారు. అదే సమయంలో ఆర్థిక శాఖను చాలా బాగా నిర్వర్తించారు. సంక్షేమ పథకాలకు ఢిల్లీ వెళ్లి పడిగాపులు కాసి ధనం తెచ్చేవారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉండేవారు.
వ్యూహాత్మక సైలెన్స్..
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి( buggana rajendranath Reddy ) కనిపించకుండా మానేశారు. వైసీపీ హయాంలో కూటమి నేతలను భయపెట్టేవారు. కర్నూలు జిల్లాలో కూటమి నేతల వ్యాపారాలను సైతం అడ్డుకున్నారు. అప్పట్లో ఓ రేంజ్ లో భయపెట్టేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. త్వరలో ఆయన బిజెపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఐదేళ్లపాటు ఆయన ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సంబంధాలతోనే బిజెపిలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది.
ఆర్థిక అవకతవకల ఆరోపణలు..
కర్నూలు జిల్లా( Kurnool district) డోన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. డోన్ అంటేనే కోట్ల, కేఈ కుటుంబాలకు అడ్డా. ఆ రెండు కుటుంబాలను కాదని రెండుసార్లు గెలిచారు బుగ్గన. 2024 ఎన్నికల్లో మాత్రం కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కోట్ల కుటుంబంతో పాటు కేఈ కుటుంబం టిడిపిలో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖ నిర్వహించడంతో అప్పట్లో అడ్డగోలుగా వ్యవహరించారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే బుగ్గన బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అన్ని కుదిరితే కొద్ది రోజుల్లోనే ఆయన కమలం గూటికి వెళ్తారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.