Canada: కెనడాలో భారత సంతతి బిల్డర్‌ హత్య.. కాల్చి చంపిన దుండగులు!

బూటాసింగ్‌ గిల్‌ను అల్బెర్టా ప్రావిన్స్‌లోని మిల్‌వుడ్‌ రెక్‌ సెంటర్‌ సమీపంలో ఈతని వ్యాపారానికి సంబంధించిన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

Written By: Raj Shekar, Updated On : April 10, 2024 10:44 am

Canada

Follow us on

Canada: ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు వేర్వేరు కారణాలతో వరుసగా చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 మంది మృత్యువాతపడ్డారు. వరుస మరణాలు భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కెనడాలో ఉంటున్న భారత సంతతికి చెందిన ప్రముఖ బిల్డర్‌ బూటా సింగ్‌ గిల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం (ఏప్రిల్‌ 8న) దుండగులు అతడిని కాల్చి చంపేశారు. బూటాసింగ్‌ గిల్‌ గురునానక్‌ సిక్కు ప్రార్థనామందిరం అధ్యక్షుడిగా ఉన్నారు. ఇతనితోపాటు ఇంజినీర్‌ సరబ్జీత్‌సింగ్‌ అనే వ్యక్తిపైనా దుండగులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

పలువురి సంతాపం..
బూటాసింగ్‌ గిల్‌ను అల్బెర్టా ప్రావిన్స్‌లోని మిల్‌వుడ్‌ రెక్‌ సెంటర్‌ సమీపంలో ఈతని వ్యాపారానికి సంబంధించిన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గిల్‌ హత్యతో స్థానిక వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. పార్లమెంటు సభ్యుడు టిమ్‌ ఉప్పల్, మేయర్‌ అమర్జీత్‌సింగ్‌ సోహి, రేడియో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మణిందర్‌ గిల్, గురు శరణ్‌సింగ్‌ బటర్‌ లాంటి ప్రముఖులు బాధిత కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. అండగా ఉంటామని సంఘీభావాన్ని ప్రకటించారు.

ఏం జరిగిందంటే..
ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రదేశంలో ముగ్గురు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే కాల్పులకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. తనకు బెదిరింపుకాల్స్‌ వస్తున్నట్టు గతంలో గిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే బూటాసింగ్‌ హత్యకు గురికావడంతో ఇతర బిల్డర్లకు కూడా ప్రాణహాని ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హత్యకు ముందు కొత్తగా నిర్మించిన ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలు జరిగినట్లు సమాచారం. భారతదేశంలోని క్రిమినల్‌ ముఠాతో లింకున్న ముఠా వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని స్థానిక పోలీసు అధికారి డేవ్‌ పాటన్‌ తెలిపారు. ఈ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. .